logo

తాగి రభస చేసిన వైద్యుడిపై ఫిర్యాదు

వేటపాలెం ప్రాథమిక వైద్యశాలలో వైద్యుడు ప్రభాకర్‌ సహచర సిబ్బందితో కలిసి ఈనెల 25న పీహెచ్‌సీలోనే మద్యం తాగారని స్పందనలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు జడ్పీటీసీ సభ్యురాలు బండ్ల తిరుమలాదేవి సోమవారం ఫిర్యాదు చేశారు.

Updated : 28 Mar 2023 06:46 IST

తిరుమలాదేవి ఫిర్యాదుపై విచారణ జరపాలని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లును ఆదేశిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

బాపట్ల: వేటపాలెం ప్రాథమిక వైద్యశాలలో వైద్యుడు ప్రభాకర్‌ సహచర సిబ్బందితో కలిసి ఈనెల 25న పీహెచ్‌సీలోనే మద్యం తాగారని స్పందనలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు జడ్పీటీసీ సభ్యురాలు బండ్ల తిరుమలాదేవి సోమవారం ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ను కలిసిన ఆమె ఆసుపత్రిలో ఈ నెల 25న వైద్యుడు, సిబ్బంది విధి నిర్వహణ సమయంలో పట్టపగలే మద్యం తాగుతున్న విషయాన్ని తాను పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులను వైద్యుడు బతిమాలి  కేసు లేకుండా సర్దుబాటు చేసుకున్నారని ఆరోపించారు. వైద్యుడు ప్రభాకర్‌, యూడీసీ శ్రీనివాస్‌ ఆసుపత్రిలో మద్యం తాగి రభస చేస్తుండగా స్థానికులు గమనించారని తెలిపారు. అదేమని ప్రశ్నించిన వారిని బూతులు తిడుతూ మద్యం మత్తులో చొక్కా లేకుండా వైద్యుడు ఆసుపత్రికి బయటకు వచ్చారన్నారు. ఆ వైద్యుడి పనితీరు బాగా లేదని ఇదే విషయమై ఈ ఏడాది జనవరిలో ప్రకాశం జడ్పీ స్టాండింగ్‌ కమిటీలో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. వేటపాలెం ఆసుపత్రికి గతంలో రోజూ వందకు పైగా రోగులు వచ్చి వైద్యం చేయించుకునే వారని వైద్యుడి నిర్వాకం కారణంగా ప్రస్తుతం ఆ సంఖ్య 20కు పడిపోయిందన్నారు. వైద్యుడు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ స్పందించి ఫిర్యాదుపై విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఫిర్యాదు చేసిన వారిలో వార్డు సభ్యురాలు రామలక్ష్మి, బాబు, రేణుక తదితరులు ఉన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని