logo

మళ్లీ ఇదేం బాదుడు

 ఏప్రిల్‌ నెలలో వాడుకున్న విద్యుత్తుకు మే నెలలో బిల్లు ఇస్తున్నారు. ఇందులో ప్రతిఒక్కరికి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనంగా బిల్లు రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Updated : 30 May 2023 06:21 IST

ఇంధన సర్దుబాటు పేరిట విద్యుత్తు ఛార్జీల పెంపు
పెరిగిన భారంతో సామాన్యులు విలవిల

పర్చూరు పట్టణంలో నివసించే ఒక కుటుంబానికి మే నెల బిల్లు రూ.255 వచ్చింది. ఇందులో ట్రూఅప్‌ ఛార్జీలు రూ.28.17 కాగా ఈ నెలలో అదనంగా విధించిన ఇంధన కొనుగోలు ఛార్జీలు రూ.24.12 భారం పడింది. ఈ లెక్కన ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో రూ.52 భారం పడింది. రూ.255 బిల్లులో రూ.52 ట్రూఅప్‌ భారం పడటం గమనార్హం.  

ఈనాడు-నరసరావుపేట, బాపట్ల : ఏప్రిల్‌ నెలలో వాడుకున్న విద్యుత్తుకు మే నెలలో బిల్లు ఇస్తున్నారు. ఇందులో ప్రతిఒక్కరికి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనంగా బిల్లు రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు పెంచామని చెప్పకపోయినా బిల్లు పెరగడంపై సంబంధిత శాఖ అధికారులను ఆరా తీస్తున్నారు. గతంలో డిస్కంలకు వచ్చిన నష్టాలను ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వేయడం వల్ల బిల్లు పెరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగుతుందని చెప్పడంతో ఇదేమి దోపిడీ అంటూ వాపోతున్నారు. ఇప్పటికే ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో గతేడాది ఆగస్టు నుంచి బిల్లులు పెరగ్గా మళ్లీ ఇప్పుడు బాదుడు ఏంటని సామాన్యులు విలవిలలాడి పోతున్నారు. మార్కెట్‌లో నిత్యావసరాల నుంచి గ్యాస్‌ వరకు అన్ని ధరలు పెరిగి కుటుంబపోషణ భారంగా మారిన నేపథ్యంలో విద్యుత్తు బిల్లు పెరగడంతో అల్లాడిపోతున్నారు.

కొనసాగుతున్న వడ్డన

విద్యుత్తు సంస్థలకు 2014 నుంచి 2019 వరకు వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి గతేడాది ఆగస్టు నుంచి యూనిట్‌కు 22 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది 36 నెలలపాటు కొనసాగుతుందని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాపై మొత్తం రూ.425.92 కోట్ల సొమ్ము భారం పడింది. ఇది కొనసాగుతుండగానే మళ్లీ ఇప్పుడు ఇంధన కొనుగోలు సర్దుబాటు పేరుతో అదనపు భారం వేయడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు అదనంగా భారం వేయనున్నారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వినియోగదారులపై రూ. కోట్లలో అదనపు భారం పడనుంది. సీఆర్‌డీఏ పరిధిలో ఎల్‌టీ విభాగం 368296 కనెక్షన్లు, హెచ్‌టీ కనెక్షన్లు 546 ఉన్నాయి. గుంటూరు సర్కిల్‌ పరిధిలో 1389779 ఎల్‌టీ కనెక్షన్లు, హెచ్‌టీ కనెక్షన్లు 1249 ఉన్నాయి. వీరందరిపై ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు పడ్డాయి. గతేడాది ఏప్రిల్‌లో వినియోగించుకున్న విద్యుత్తుకు ప్రస్తుత ఏప్రిల్‌ నెలలో ఇచ్చే బిల్లులో సర్దుబాటు చేశారు. దీంతో మే నెల బిల్లులో మొత్తం పెరిగింది. ఏ నెలకు ఆ నెల వచ్చే మార్చి నెల వరకు వసూలు చేస్తారు. ఏప్రిల్‌ నెలలో యూనిట్‌కు 20 పైసలుతో మొదలై గరిష్ఠంగా 66 పైసల వరకు భారం పడుతుంది.

అద్దె ఇంట్లో అదనపు పోటు

2014 నుంచి 2019 వరకు వాడిన విద్యుత్తు వినియోగాన్ని లెక్కించి ఇప్పుడు సంబంధిత వినియోగదారునికి సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల అప్పట్లో అద్దెకు ఉన్నవారు వాడిన యూనిట్ల ఆధారంగా ప్రస్తుతం నివాసం ఉన్నవారికి బాదుడు భారం భరిస్తున్నారు. తాజాగా 2021-22 సంవత్సరంలో వాడుకున్న విద్యుత్తుకు ఇప్పుడు ఇంధన సర్దుబాటు కొనుగోలు ఛార్జీలు ప్రస్తుత ఏప్రిల్‌ నెల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో గతంలో ఆ ఇంట్లో అద్దెకు ఉన్నవారు ఎక్కువ విద్యుత్తు వాడుకున్నట్లయితే ఇప్పుడున్నవారు తక్కువ వాడుకున్నా భారం మోయక తప్పదు. గతంలో వాడుకున్నవారికి ఇప్పుడు తాము సర్దుబాటు ఛార్జీలు చెల్లించడం దారుణమని అద్దెదారులు వాపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు యజమానుల దృష్టికి అద్దెదారులు తీసుకెళ్లగా తామేమి చేయలేమని ఎప్పుటి నుంచో అద్దెకు ఇస్తున్నందున ఎవరుంటే వారే చెల్లించాలని స్పష్టం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని