logo

ఉల్లంగనులపై నిఘా

ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో కొలువుదీరలేదు.

Published : 04 Jun 2023 04:54 IST

నరసరావుపేటలో జిల్లా కార్యాలయం ఏర్పాటు
న్యూస్‌టుడే, నరసరావుపేట టౌన్‌

గనులు, భూగర్భ శాఖ జిల్లా కార్యాలయం

ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో కొలువుదీరలేదు. ఏడాది గడిచినా పూర్తిస్థాయిలో యంత్రాంగం రూపుదిద్దుకోలేదు. పల్నాడు జిల్లా ఆవిర్భావంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ జిల్లా కేంద్రానికి తరలించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికి కొన్ని శాఖలు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చే గనులు, భూగర్భ శాఖ కార్యాలయం ఏడాది తర్వాత జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు.

కొత్త జిల్లా ఏర్పాటుకు ముందు దాచేపల్లిలో మాత్రమే ఏజీ కార్యాలయం ఉండేది. దాని పరిధిలోని ఎనిమిది మండలాలతో పాటు గుంటూరు పరిధిలో కొనసాగుతున్న పది మండలాలను ఇప్పుడు వేరు చేశారు. వీటన్నింటినీ కలిపి నరసరావుపేట కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కార్యకలాపాలు నరసరావుపేట కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో మాత్రం దాచేపల్లి కార్యాలయం సేవలందించనుంది. ఈ రెండు కార్యాలయాలకు కలిపి జిల్లా అధికారి (డీఎంజీవో) నరసరావుపేటలో ఉంటారు. స్థానిక ఎన్జీవో కాలనీ మూడో లైన్‌లోని అద్దె భవనంలో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు, దాచేపల్లి కార్యాలయాల నుంచి సంబంధిత దస్త్రాలను తీసుకొస్తున్నారు. దీంతో పాటు సిబ్బందిని కూడా వివిధ ప్రాంతాల నుంచి సర్దుబాటు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కొంత సమయం పడుతుందని సిబ్బంది తెలిపారు.

అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట

కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్‌లున్నాయి. అమరావతి, వైకుంఠపురం, కోనూరు, అంబడిపూడి, పొందుగల పరిధిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిలో పలు అవతవకలు చోటుచేసుకుంటున్నాయి. పర్యావరణ అనుమతులు ముగియడం, కేటాయించిన ప్రదేశం వదిలేసి ఇతర చోట్ల ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని స్పందనలో జిల్లా పాలనాధికారికి పలు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారించి అక్రమాల నిగ్గుతేల్చడం కష్టమవుతోంది. గతంలో ఓ సారి జిల్లా పాలనాధికారి శివశంకర్‌ కూడా స్వయంగా కృష్ణా నది రీచ్‌లకు వెళ్లి పరిశీలించారు. గత ఏడాది కాలంలో సంబంధిత శాఖ అధికారుల కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నాయి. నరసరావుపేట-చిలకలూరిపేట మధ్య ఓగేరు వాగులో ఇసుక తవ్వకాలు, చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రానైట్‌ తవ్వకాలు, కోటప్పకొండ, కొండవీడు, నకరికల్లు కొండల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. బోయపాలెం, వంకాయలపాడు, బొప్పూడి, కోటప్పకొండలో స్టోన్‌క్రషర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సిమెంట్‌, సున్నం, ముగ్గురాళ్ల నిక్షేపాలున్నాయి. ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో భారీఎత్తున ఆదాయం జిల్లా నుంచే సమకూరుతుంది. అయితే ఈ గనుల తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అధికారులు వచ్చే సమయానికి అక్రమార్కులు జారుకునే అవకాశముండేది. ఇప్పుడు అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.


దస్త్రాలు తెప్పిస్తున్నాం

ఉన్నతాధికారుల ఆదేశంతో జిల్లా కార్యాలయాన్ని నరసరావుపేటలో ఏర్పాటు చేశాం. కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చా. గతంలో విజిలెన్స్‌ విభాగంలో పని చేసినప్పుడు ఈ ప్రాంతంపై అవగాహన ఉంది. సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నాం. గుంటూరు, ఇబ్రహీంపట్నం కార్యాలయాల నుంచి ఇక్కడి గనులకు సంబంధించిన దస్త్రాలను తెప్పిస్తున్నాం. గనుల తవ్వకాల్లో నిబంధనలు అమలు చేస్తాం. ఫిర్యాదులు వస్తే విచారించి చర్య తీసుకుంటాం.

వాసికర్ల నాగిని, జిల్లా అధికారి, గనులు భూగర్భ శాఖ, పల్నాడు జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని