logo

కరెంటు ఎప్పుడు వచ్చేనో...

మండుతున్న ఎండలు.. తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్న తరుణంలో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో ప్రజలు మరింత అల్లాడిపోతున్నారు. ఓవర్‌ లోడు సమస్యతో రాత్రులు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు కాలిపోతున్నాయి.

Updated : 09 Jun 2023 06:21 IST

ఓవర్‌ లోడు సమస్యతో సరఫరాకు తరచూ అంతరాయం
కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చని విద్యుత్తు అధికారులు

బాపట్ల, న్యూస్‌టుడే: మండుతున్న ఎండలు.. తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్న తరుణంలో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో ప్రజలు మరింత అల్లాడిపోతున్నారు. ఓవర్‌ లోడు సమస్యతో రాత్రులు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు కాలిపోతున్నాయి. కరెంటు తీగలు తెగిపడి రాత్రులు గంటల తరబడి సరఫరా నిలిచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. లోడుకు తగ్గట్లుగా అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో విద్యుత్తు శాఖ విఫలమైంది. జిల్లా కేంద్రం బాపట్ల వాసులను కరెంటు కష్టాలు వీడటం లేదు. తీరప్రాంతంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం 32 డిగ్రీలుగా ఉండటంతో రాత్రులు వాతావరణం చల్లబడటం లేదు. రాత్రి ఎనిమిది గంటలైనా వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. దీంతో ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. ఒక్కో ఇంట్లో రెండు, మూడు ఏసీలు వినియోగిస్తున్నారు. కరెంటు వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య ఓవర్‌లోడ్‌ సమస్య ఎదురవుతోంది. పీక్‌లోడ్‌ సమయంలో 6.5 మిలియన్ల యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది.

అర్ధరాత్రి జాగారం

బాపట్ల పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంతం, విజయలక్ష్మీపురం, రైలుపేట రాజీవ్‌గాంధీ కాలనీ, శృంగారపురం, భీమావారిపాలెం, ఎస్‌ఎన్‌పీ అగ్రహారం, శ్రీనివాసనగర్‌ కాలనీలో రోజూ రాత్రి సమయంలో ఓవర్‌లోడ్‌ సమస్య కారణంగా కరెంటు సరఫరా నిలిచిపోతోంది. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ప్యూజులు కాలిపోతున్నాయి. ఇన్సులేటర్లు సైతం దెబ్బతింటున్నాయి. సరఫరా పునరుద్ధరించటానికి 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతోంది. దీంతో ప్రజలు అర్ధరాత్రి జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవర్‌లోడు సమస్య ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కనీసం ఏడు నుంచి ఎనిమిది కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నెల నుంచి ఈ సమస్య ఉన్నా కొత్తవి రాలేదు. దీనికితోడు పుండు మీద కారం చల్లినట్లు రహదారుల విస్తరణ పనుల నిమిత్తం కరెంటు సరఫరా నిలిపివేస్తుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా కేంద్రం బాపట్ల, పట్టణాల్లో విద్యుత్తు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిందని, పీక్‌లోడ్‌ సమయంలో అధిక భారంతో ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజులు కాలిపోయి సరఫరా నిలిచిపోతున్నట్లు ఈఈ ఆంజనేయులు చెబుతున్నారు.  సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు.


చీరాలలో అనధికార కోతలు

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: చీరాలలో అనధికారిక విద్యుత్తు కోతలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్ది విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో ప్రజలు వాపోతున్నారు. ఈ సమయంలో క్షేత్రస్థాయి సిబ్బందికి ఫోను చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈదురుగాలులకు చీరాల పట్టణంలో పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు పడిపోవడంతో పాటు చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడ్డాయి. దీనివలన పట్టణంలోని వైకుంఠపురం, దండుబాట, విఠల్‌నగర్‌, కొత్తపేట, ప్రసాదునగరం, జాండ్రపేట తదిర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే కరెంటు ఇచ్చినా మరికొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల వరకు సమయం పట్టింది. చీరాల విద్యుత్తు డివిజన్‌ పరిధిలో చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాలున్నాయి. వీటిల్లో 1.65 లక్షల సర్వీసులు ఉన్నాయి. రోజుకి 11 లక్షల యూనిట్ల విద్యుత్తు వినియోగం ఉండగా ప్రస్తుతం ఎండలు పెరగడంతో మరో లక్ష యూనిట్లు డిమాండ్‌ అదనంగా కావాల్సి రావడం కూడా సమస్య ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. వేటపాలెం, చినగంజాం మండలాల్లో ఆక్వా పరిశ్రమ ఉంది. ఇక్కడ కూడ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉండటంతో రైతులు జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. డీజిల్‌కు అదనంగా వ్యయం చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. దీనికితోడు తీరప్రాంతంలో విద్యుత్తు లైన్లు మూడు దశబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. మొత్తం వేయి కిలోమీటర్లకు గాను, ఇప్పటి వరకు 70 కిలోమీటర్ల మాత్రమే మార్పు చేశారు. పాత లైన్లు కావడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై చీరాల విద్యుత్తు ఈఈ కె.సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ పరివర్తకాల మార్పు, గాలులు వలన స్తంభాలు పడిపోవడం, తీగలు తెగడం వలన సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు. అధికారికంగా ఎక్కడ కోతలు విధించడం లేదన్నారు.


వేమూరులో రోడెక్కిన స్థానికులు

వేమూరు ఉపకేంద్రం ఎదురుగా ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులు

వేమూరు, న్యూస్‌టుడే: తెగిపడిన విద్యుత్తు తీగకు సంబంధిత శాఖ అధికారులు మరమ్మతులు జాప్యం చేయడంపై స్థానికులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో తెనాలి-వెల్లటూరు ఆర్‌అండ్‌బీ రహదారిపై ఆందోళనకు దిగారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రహదారిపై బైఠాయించారు. వేమూరు 6వ వార్డులో గురువారం సాయంత్రం 5గంటల సమయంలో విద్యుత్తు తీగ తెగింది. ఈ విషయమై వేమూరు లైన్‌మెన్‌కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి సరఫరా నిలిపేశారు. గంటలో మరమ్మతులు పూర్తి చేస్తామని చెప్పారు. తరవాత ఫోన్‌చేస్తే ‘ఇదిగో అదిగో’ అంటూ సమయం గడిపారు. రాత్రి 8 గంటలైనా మరమ్మతులు చేయలేదని ప్రశ్నించడానికి ఫోన్‌చేస్తే ఆ ప్రాంత లైన్‌మెన్‌ ఫోన్‌ స్విచాఫ్‌ అయింది. చేసేది లేక విద్యుత్తు ఉప కేంద్రానికి ఫోన్‌చేస్తే వారు ఫోన్‌ తీయలేదు. దీంతో ఆ ప్రాంత వాసులు సుమారు 100 మంది ఉప కేంద్రం వద్దకు వెళ్లి ప్రశ్నించగా అక్కడ ఉన్న ఆపరేటర్‌ ఈ సమయంలో ఏం చేయలేమని బదులిచ్చాడు. దీంతో ఆందోళన కారులు సబ్‌స్టేషన్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సబ్‌ ఇంజినీర్‌తో పోలీసులు మాట్లాడారు. వెంటనే మరమ్మతులు చేయించాలని విద్యుత్తు సిబ్బందిని కోరారు.  10.45 గంటలకు మరమ్మతుల అనంతరం సరఫరాను పునరుద్ధరించడంతో ఆందోళనకారులు నిరసన విరమించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని