logo

ఫిట్నెస్‌ లేకుండా రాకపోకలు సాగిస్తే చర్యలు

విద్యా సంస్థల బస్సులన్నీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి తప్పనిసరిగా సామర్థ్య పత్రం పొంది ఉండాలని గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్‌ షేక్‌ కరీం సూచించారు.

Published : 10 Jun 2023 04:44 IST

మాట్లాడుతున్న డీటీసీ షేక్‌ కరీం, వేదికపై అధికారులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: విద్యా సంస్థల బస్సులన్నీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి తప్పనిసరిగా సామర్థ్య పత్రం పొంది ఉండాలని గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్‌ షేక్‌ కరీం సూచించారు. గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో పాఠశాలలు, కళాశాలల బస్సుల యాజమాన్యాలు, డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. కరీం మాట్లాడుతూ ‘విద్యా సంస్థలు పునఃప్రారంభం అవుతున్నందున బస్సులకు ఫిట్నెస్‌ పరీక్షలు చేయించి ధ్రువీకరణపత్రం తీసుకోవాలి. అందుకు నియమ, నిబంధనలు తప్పనసరిగా పాటించాలి. బస్సు డ్రైవర్‌కు 60 సంవత్సరాలు మించకూడదు. ప్రతి మూడు నెలలకు ఓసారి డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. బస్సు నడిపేందుకు డ్రైవర్‌కు కనీసం అయిదేళ్లు అనుభవం తప్పనిసరి. ఫిర్యాదుల పెట్టె ప్రతి బస్సులో ఉండాలి. అత్యవసర ద్వారం తెరుచుకోవాలి. ప్రథమ చికిత్స పెట్టెలో మందులు ఉంచాలి. పాఠశాల, కళాశాల ఆవరణలోనే బస్సు నుంచి దిగాలి, ఎక్కాలి. ప్రతి బస్సులో ఒక అటెండర్‌ కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అటెండర్‌ బస్సు వాహనం నడపడానికి అనుమతించకూడదు. ప్రతి బస్సులో అగ్నిమాపక నివారణ పరికరం ఉండాలి. పరిమిత సీటింగ్‌ కెపాసిటీ కంటే ఎక్కువ మందిని విద్యార్థులను బస్సులో ఎక్కించకూడదు. విద్యార్థులు బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అటెండర్‌ దగ్గర నిలబడి సురక్షితంగా దిగేలా చూడాలి’.. అని వివరించారు. కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి గోపాల్‌, ఎంవీఐలు రాఘవరావు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని