logo

ప్రభుత్వం మారితేనే యువతకు భవిత

ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ విమర్శించారు.

Published : 29 Mar 2024 04:17 IST

ఎన్డీయే గుంటూరు అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే : ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ విమర్శించారు. గురువారం తెనాలి కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌, ఎన్డీయే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రాజధాని అంశాన్ని పూర్తిగా పక్కకు పడేసిందన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా చేసి యువతకు ఉపాధిని దూరం చేసిందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టులకు రూ.73 వేల కోట్లు కేటాయించి పట్టిసీమ వంటి వాటిని పూర్తి చేయడం వల్ల నేడు రైతాంగానికి ఉపయోగపడుతోందన్నారు. ఈ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. వైకాపా ప్రభుత్వం మారితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. తెదేపా, జనసేన, భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించనున్న పథకాల గురించి వివరించారు. సద్దాం హుస్సేన్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న విషయాన్ని ఒక విలేకరి ప్రస్తావించగా ఈ విషయంపై తాను ఇప్పటికే క్షమాపణలు చెప్పానని, మరో మారు చెబుతున్నానని పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర నిధులతో తెనాలి నియోజకవర్గాన్ని నమూనాగా తీర్చిదిద్దుతామని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. గుంటూరు పార్లమెంటు తెదేపా మహిళా విభాగ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని