logo

మీ పనులకో దండం!

గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

Updated : 29 Mar 2024 05:10 IST

పది నెలలుగా బిల్లులకు దిక్కులేదు
రుణ ఒత్తిళ్లతో ఫోన్లు ఎత్తని గుత్తేదారులు  
గడప గడపకు-మన ప్రభుత్వం పనుల తీరిది
ఈనాడు, అమరావతి

గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గతేడాది జూన్‌, జులై నెలల్లోనే ఆ పనులు పూర్తి చేస్తే వాటి తాలూకూ బిల్లులు ఇప్పటివరకు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీనిపై గుత్తేదారులు మండిపడుతున్నారు. చివరగా గతేడాది డిసెంబరు 19న ఆ పనులకు సంబంధించి కొన్ని బిల్లులు పాస్‌ అయ్యాయి. అవి సుమారు రూ.4-5 కోట్లు ఉంటాయి. అవి మినహా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇలాగైతే తాము ఎలా బతకాలని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఆగమేఘాల మీద పనులు పూర్తి చేయించి తీరా బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేస్తే తమకు వడ్డీ మేర కూడా గిట్టుబాటు కాదని ఆందోళన చెందుతున్నారు.


రూ.10 కోట్లకు పైగా పెండింగ్‌

తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే డివిజన్లలో మురుగు కాల్వలు, డ్రెయిన్లు, కల్వర్టులు, తాగునీటి పైపులైన్లకు సంబంధించిన అనుసంధానం తదితర పనులు 150కు పైగా చేశారు. వాటికి సుమారు రూ.10కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉందని, ఇన్నాళ్లు పెండింగ్‌ పెడితే తమకు వడ్డీకి కూడా చాలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ముందుగానే నిధులు విడుదల చేస్తున్నామని, బిల్లుల చెల్లింపునకు నిధుల సమస్య తలెత్తదని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ వద్ద నిధులు అందుబాటులో ఉంటాయని, పనులు చేపట్టిన వెంటనే బిల్లులు పొందవచ్చని అప్పట్లో ప్రభుత్వం ఊదరగొట్టింది. దీంతో గుత్తేదారులు పోటీపడి మరీ తక్కువకు పనులు దక్కించుకుని పూర్తి చేశారు. తీరా బిల్లులకు నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో ఇప్పుడు వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పోసొప్పో చేసి వాటిని చేసిన గుత్తేదారులు ప్రస్తుతం ఎవరైనా ఫోన్లు చేస్తే తీసే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. అప్పులిచ్చిన వాళ్లు డబ్బులు అడుగుతారనే భయం వారిని వెంటాడుతోంది.

ఆ నిధులెటు మళ్లించారు?

పది నెలల కిందటే ఆ బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్లోడ్‌ చేసినా ఇప్పటివరకు రాలేదు. దీంతో ఆ నిధులను వేటికైనా మళ్లించారా అనే కోణంలో గుత్తేదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత బిల్లులే పెండింగ్‌ పడ్డాయని చెప్పి మరే ఇతర పనులకు వారు పోటీ పడడం లేదు. కలెక్టర్ల వద్దే నిధులు ఉంటే బిల్లుల చెల్లింపులో ఇంత జాప్యమెందుకు జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. పనులు చేయండి బిల్లులకు ఇబ్బందేమీ లేదని నాడు ఒత్తిడి చేసి మరీ చేయించిన పలువురు ఇంజినీరింగ్‌ అధికారులు ఇప్పుడు వాటి ఊసే మరిచారు. వారిని ప్రశ్నిస్తే తమ చేతిలో ఏమీ లేదని చేతులెత్తేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేయించిన అధికారులు పట్టించుకోక.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆ నిధులు వస్తాయా? రావా? అన్న ఆందోళనను గుత్తేదారులు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని