logo

పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు

కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు.

Published : 29 Mar 2024 04:39 IST

డెల్టాలో ఏర్పాటు కాని రైస్‌ క్లస్టర్‌
పరిశ్రమలు లేక వరి రైతులకు గిట్టుబాటు కాని వ్యవసాయం
ఈనాడు - అమరావతి

కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. స్థానికంగా ధాన్యాన్ని శుద్ధి చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే యూనిట్లు లేకపోవడంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాపారులు ఇక్కడి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధాన్యం రూపంలోనే విక్రయాలు చేస్తుండటంతో వచ్చే అరకొర ఆదాయంతో వరి సాగుదారులు ఏటా నష్టపోతున్నారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చడం, బియ్యం నుంచి రవ్వ వంటి ఉప ఉత్పత్తులు తయారీ, తవుడు నుంచి ఆయిల్‌ తయారుచేయడం వంటి యూనిట్లు లేకపోవడంతో ధాన్యం రూపంలోనే రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన రైతు కంటే ధాన్యం కొనుగోలు చేసి బియ్యం, ఇతర ఉత్పత్తులుగా మార్చి విక్రయించే వ్యాపారులు అధికంగా లబ్ధి పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధాన్యానికి మెరుగైన ధర కల్పించాలనే లక్ష్యంతో డెల్టాలో రైస్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.

అయిదేళ్లలో హామీలన్నీ గాలికి..

ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తుండడంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలో భూసేకరణ చేయాలని నిర్ణయించారు. రైతులు, మిల్లుల నిర్వాహకులు, తవుడు నుంచి ఆయిల్‌ తయారీ యూనిట్ల నిర్వాహకులతో చర్చించి ఒక కమిటీ వేసే దశలో వివిధ కారణాలతో ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు క్లస్టర్‌ ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుపై పలుమార్లు హామీలు ఇచ్చినా అవన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి.


బహుళ ప్రయోజనాలెన్నో..

జిల్లాలో రైస్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తే ధాన్యం నుంచి బియ్యం, ఉప ఉత్పత్తులు తయారుచేయవచ్చు. క్లస్టర్‌లో రైస్‌మిల్లులు, తవుడు నుంచి వంటనూనె తయారీ, పశువుల దాణా, వివిధ రకాల రవ్వలు, ఆహార పదార్థాలు తయారు చేసే యూనిట్లు ఉంటాయి. డెల్టాలో నాణ్యమైన బీపీటీ 5204 ధాన్యం విస్తారంగా పండుతున్నందున నాణ్యమైన సన్న రకాల బియ్యం తయారుచేయవచ్చు. ఇక్కడి నుంచి నేరుగా దేశంలోని వివిధ నగరాలకు, విదేశాలకు సైతం ఎగుమతి చేసే వెసులుబాటు ఉంటుంది. పదుల సంఖ్యలో యూనిట్లు ఒకే గొడుగు కింద ఒకే ప్రాంతంలో పని చేయడం వల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ప్రత్యక్షంగా వందల మందికి పరోక్షంగా వేలమంది ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. బహుళ ప్రయోజనాలు ఉన్న రైస్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దఎత్తున రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ చూపి భూమి కేటాయించి అందరి భాగస్వామ్యంతో కమిటీ  ఏర్పాటు చేస్తే కల సాకారమయ్యేది. ఇందుకు భిన్నంగా ఐదేళ్ల కాలంలో అలాంటి ఆలోచన సైతం చేయకపోవడంతో రైతులు ఆశలు ఆవిరయ్యాయి.


నాడు ఊరూరా తిరిగి ఊదరగొట్టి

ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఊరూరా తిరిగి ఊదరగొట్టారు. ఎన్నికల ప్రణాళికలో సైతం ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గోదాములు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అవసరం మేరకు ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమలు ఐదేళ్ల కాలంలో వ్యక్తిగతంగా నడుపుకునే చిన్న యూనిట్లు మినహా పెద్ద యూనిట్లు ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా ధాన్యం ఆధారిత యూనిట్లు ఏర్పాటు చేయకపోవడంతో రైతుల ఆశలు గల్లంతయ్యాయి. జిల్లాలో ధాన్యం విస్తారంగా పండుతున్న అందుకు అనుగుణంగా ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు