logo

ప్రజల గొంతూ తడపలేరా?

2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Published : 25 Apr 2024 05:10 IST

తాగునీటి సమస్యను పరిష్కరించలేని ఎమ్మెల్యే కిలారి

నిడుబ్రోలులోని మంచినీటి చెరువు

పొన్నూరు, న్యూస్‌టుడే: 2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల కాలంలో పొన్నూరు పట్టణంలోని తాగునీటి సమస్య పరిష్కారానికి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు.

  • 2019 ఎన్నికల సమయంలో అప్పటి వైకాపా అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి రాగానే మంచినీటి సమస్యను పరిష్కారస్తామని వెల్లడించారు. తాగునీటిని తెదేపా ప్రభుత్వం ఒక్క పూట మాత్రమే సరఫరా చేసిందని, వైకాపా అధికారంలోకి వస్తే ఉదయం, సాయంత్రం సమయాల్లో తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
  • పొన్నూరు పట్టణ పరిధిలోని నిడుబ్రోలు, క్యాబిన్‌పేట, రైలుపేట, నేతాజీనగర్‌, శ్రీనగర్‌ కాలనీ, వడ్డిముక్కల రోడ్డు, వీవర్స్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, ముబారక్‌ నగర్‌, డఫ్‌పేట, సాయినగర్‌, సాంబశివరావునగర్‌, తదితర ప్రాంతాల్లో చాలా కాలం నుంచి పురపాలక సంఘ అధికారులు సరఫరా చేసే తాగునీరు సరఫరా కాకపోవడంతో కాలనీ వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఫిర్యాదు చేసినా ఇంజినీరింగ్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వ్యక్తిగత అవసరాలకు నీరు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
  • తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టణంలోని 31 వార్డులో సుమారు 250 వరకు చేతి పంపులను ఏర్పాటు చేశారు. అందులో 5, 6, 8, 18, 19, 21, 25, 27, 29 వార్డుల్లో చేతి పంపులు పాడైపోయాయి. చేతి పంపులు బాగు చేయించమని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మహిళలు చెబుతున్నారు. వాటి మరమ్మతులకు వైకాపా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. చేతి పంపులు అందుబాటులో లేకపోవడంతో నీటి కోసం మహిళలు నానా అవస్థలు పడుతున్నారు.
  • అయిదేళ్ల కాలంలో ప్రతి వేసవిలో ఒక్కపూట తాగునీటిని కూడా వైకాపా ప్రభుత్వం అందించలేకపోయింది. మూడు నెలల నుంచి తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేరని మహిళలు వాపోతున్నారు. సాయంత్రం పూట తాగునీటి సరఫరా మాట నీటిపై రాతగానే మిగిలిపోయింది. ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య ఎన్నికల హామీ విస్మరించారని పుర ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టణం : పొన్నూరు వార్డు : 31
కుటుంబాలు : 17,500
జనాభా: 61,500
కుళాయిల సంఖ్య : 5,500
ప్రతి రోజు మంచినీటి
సరఫరా : 8 లక్షల లీటర్లు

డబ్బా నీటిని కొనుగోలు చేస్తున్నాం

మా వార్డులో మూడు నెలల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదు. వ్యక్తిగత అవసరాల కోసం చేతి పంపులో నీటిని వాడుకుంటున్నా. ప్రైవేటు వ్యాపారుల వద్ద డబ్బా నీటిని కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నా. ఇప్పటికే కుటుంబ అవసరాల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మా లాంటి సామాన్యుడు డబ్బులు చెల్లించి తాగునీటి కొనుగోలు చేయాల్సి దుస్థితి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడింది.

చిలకా ప్రభుదాస్‌,13వ వార్డు

తెచ్చుకోలేకపోతున్నాం

చాలా రోజులు నుంచి తాగునీరు రావడం లేదని పురపాలక సంఘ అధికారులను కలిసి లిఖత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. మా సమస్య పరిష్కారం కాలేదు. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోలేకపోతున్నాం. ఇప్పటికే వృద్ధాప్యం కావడంతో అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.

సాతులూరి మల్లేశ్వరి, 11వ వార్డు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని