logo

చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు.

Updated : 25 Apr 2024 06:04 IST

ఏఎన్‌యూ ఖ్యాతిని మంటగలిపిన వైకాపా సర్కారు
ఈనాడు - అమరావతి

ఇంజినీరింగ్‌ కళాశాలకు వైఎస్సార్‌ పేరు

మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. ఇదంతా గత చరిత్ర. ఇలాంటి విశ్వవిద్యాలయానికి వైకాపా పాలనలో రాజకీయ చెద పట్టింది. నాగార్జునుడనే మహోన్నతుడి పేరు మీద ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయంపై గత అయిదేళ్ల కాలంలో పడ్డ మచ్చలెన్నో! వివాదాలు, రాజకీయాలకు కేంద్రబిందువుగా మార్చేశారు. చదువులు అటకెక్కాయి. విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. వర్సిటీ పరువును గంగలో కలిపేశారు. అసలు ఇది విశ్వవిద్యాలయమా? రాజకీయ కార్యాలయమా? అనే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. విద్యా ప్రమాణాలను కాపాడాల్సిన ఉప కులపతులే అధికార పార్టీ కార్యకర్తల్లా వర్సిటీలను రాజకీయాలకు నిలయాలుగా మార్చేస్తున్నారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న పలు ఉదంతాలను ఉటంకిస్తూ గతేడాది ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సూళ్లూరు యచంద్ర రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు.

మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ, సెమినార్‌లు

వైకాపా ప్రభుత్వ మూడు రాజధానుల అనుకూల నిర్ణయానికి మద్దతుగా రాష్ట్రంలోనే తొలిసారిగా వర్సిటీలో విద్యార్థులు, ఉద్యోగులతో ర్యాలీలు చేయించి, వక్తలను పిలిచి సెమినార్‌లు నిర్వహించారు. వీటిని తప్పుపట్టిన ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి నాయకురాలొకరు కోర్టులో కేసు వేశారు.

డివైడర్ల పేరుతో నిధులు దుబారా

40 అడుగులు కూడా లేని రోడ్డుకు డివైడర్‌ ఏర్పాటు చేయడంతో ఇరుకుగా మారిందిలా..

విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుంచి రూసా నిధులొచ్చాయి. ఉన్నతాధికారులు ఏం చేశారో తెలుసా..? రహదారుల్లో డివైడర్ల నిర్మాణానికి వినియోగించారు. ఇప్పటికే చాలా భవనాలు నిరుపయోగంగా ఉన్నా.. కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఇలా ఆ నిధులను దుర్వినియోగం చేశారు.

వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు

పరిపాలన భవనం వద్ద వైఎస్సార్‌ విగ్రహం

విశ్వవిద్యాలయ చరిత్రలోనే తొలిసారిగా రాజకీయ నాయకుడైన దివంగత రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి స్వామిభక్తిని చాటుకున్నారు వర్సిటీ ఉన్నతాధికారులు. వైకాపా ప్లీనరీ సమావేశాలు నిర్వహించినప్పుడు వర్సిటీకి సెలవులు ప్రకటించి వాహనాల పార్కింగ్‌కు ఇచ్చేశారు. అంతేకాదు... యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పేరు తొలగించి వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలగా మార్చేశారు.

ఆర్థిక అవకతవకలు ఉన్నా..

2014-16 కాలంలో వర్సిటీ రిజిస్ట్రార్‌గా రాజశేఖర్‌ పని చేసినపుడు ఆర్థిక అవకతవకలపై అప్పటి తెదేపా ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చక్రపాణి కమిటీతో విచారణ చేయించింది. అవకతవకలను నిర్ధారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఈలోగా ఎన్నికలు రావడం, వైకాపా గద్దెనెక్కడంతో ఆ కమిటీ సిఫార్సులు తుంగలో తొక్కారు. రాజశేఖర్‌ను అందలమెక్కించింది.  

ప్రేరణ క్లాసుల పేరుతో కారు కూతలు

విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను తీసుకొచ్చారు. స్త్రీ జాతి మొత్తానికి నేనే దిక్కవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు తీవ్రంగా నొచ్చుకున్నారు. దీన్ని వీసీ తప్పుపట్టలేదు.. సరికదా మద్దతు పలికారని ఆరోపిస్తూ మహిళా న్యాయవాదులు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుకూలురకు గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా అవకాశం

వర్సిటీలో విద్యార్థులే అంతంతమాత్రంగా ఉన్నారు. ఉన్న రెగ్యులర్‌, ఒప్పంద, అతిథి, పొరుగు సేవల ఉద్యోగులకే పూర్తిస్థాయి పని లేదన్న అభిప్రాయం ఉంది. కానీ... వర్సిటీపై ఆర్థికభారం పడేలా గత నాలుగైదేళ్లలో ప్రభుత్వ అనుమతి లేకుండానే సుమారు వందమందిని గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా నియమించారు. వైకాపా పెద్దలు సిఫార్సు చేసిన వారికి కొన్ని పోస్టింగ్‌లు దక్కాయి.

వైఎస్‌ చిత్రపటంతో వీసీ హాల్లోకి...

తమ వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నతాధికారులు వర్సిటీని రాజకీయ కేంద్రంగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా జూనియర్‌ అయిన ఆచార్య రాజశేఖర్‌ను తొలుత ఇన్‌ఛార్జి వీసీగా నియమించింది. 2019 నవంబరులో ఆయన బాధ్యతల స్వీకారానికి వర్సిటీ ప్రధాన గేటు నుంచి పరిపాలనా భవనం వద్దకు ర్యాలీగా వచ్చారు. అక్కడి నుంచి వైఎస్సార్‌ చిత్రపటాన్ని చేతుల్లో పెట్టుకుని మరీ వీసీ హాల్లోకి వెళ్లి బాధ్యతలు తీసుకోవటం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. రెగ్యులర్‌ వీసీ అయిన తర్వాత కూడా జై జగన్‌ నినాదాల నడుమ ఆయన బాధ్యతలను స్వీకరించడం వివాదాస్పదమైంది.

కేసుల పేరుతో వేధింపులు

తనకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా వారికి నోటీసులిచ్చి వివరణ కోరారంటూ ఉన్నతాధికారులపై ఆరోపణలొచ్చాయి. డిప్యూటీ రిజిస్ట్రార్‌ యోబును కిందిస్థాయి ఉద్యోగి ఒకరు చంపుతానని బెదిరించడంతో ఆయన పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా కేసు ఎందుకు పెట్టారంటూ యోబుకు వీసీ షోకాజ్‌ నోటీసు జారీ చేసి ఇబ్బంది పెట్టారు. మరికొందరు గెస్ట్‌ ఫ్యాకల్టీలను విధుల నుంచి తొలగించారు.

వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిగా డిప్యూటీ రిజిస్ట్రార్‌ క్యాడర్‌ అధికారుల్ని నియమించాలి. కానీ.. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ క్యాడర్‌ అధికారితో ఆ విభాగాన్ని నడుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని