logo

సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లివచ్చేలా

ఇంటి నుంచి కార్యాలయాలకు సైకిల్‌పై రాకపోకలు సాగించేలా పౌరులను ప్రోత్సహించేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. అందుకోసం ఐటీకారిడార్‌పై ఇంజినీర్లు ప్రముఖంగా దృష్టి పెట్టారు. వినియోగం, ఉపయోగం అంశాలను పరిగణనలోకి తీసుకుని..

Published : 05 Oct 2022 03:23 IST

90 కి.మీ పొడవున సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి నుంచి కార్యాలయాలకు సైకిల్‌పై రాకపోకలు సాగించేలా పౌరులను ప్రోత్సహించేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. అందుకోసం ఐటీకారిడార్‌పై ఇంజినీర్లు ప్రముఖంగా దృష్టి పెట్టారు. వినియోగం, ఉపయోగం అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ ప్రాంతంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 2020 నవంబరులో కేబీఆర్‌ పార్కు, నెక్లెస్‌రోడ్డు, పలు గేటెడ్‌ కమ్యూనిటీలు, కొత్త రహదారులపై సైకిల్‌ ట్రాక్‌లు నిర్మించగా.. వేర్వేరు కారణాలతో ఆయా ఏర్పాట్లు నిరుపయోగమయ్యాయి. ఇప్పుడు.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 12 ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పుతో కొత్త డిజైన్‌తో సైకిల్‌ ట్రాక్‌ నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు సిద్ధమవుతున్నారు.

ఇతర వాహనాలు ప్రవేశించకుండా..

మూడేళ్ల క్రితం రహదారిపై కాలిబాట పక్కన సైకిల్‌ ట్రాక్‌లు నిర్మాణమయ్యాయి. నెక్లెస్‌రోడ్డుపై నాలుగు కిలోమీటర్ల మేర, కేబీఆర్‌ పార్కు చుట్టూ 1.2కి.మీ పొడవున, ఎల్బీనగర్‌ నుంచి చింతల కుంట వరకు, ఇతరత్రా ప్రాంతాల్లో ఏర్పాట్లు జరిగాయి. రోడ్డుపై కాలిబాట నుంచి 1.5మీటర్ల దారిని సైకిళ్ల కోసం కేటాయించి, ఆ స్థలాన్ని పసుపు రంగు గీతతో విభజించారు. గీత పొడవునా ప్రతి 100మీటర్లకు ఒక బోర్డును ఏర్పాటు చేసి, సూచించిన సమయాల్లో వాహనదారులు గీత లోపలికి ప్రవేశించవద్దని హెచ్చరించారు. వాహనదారులు మాత్రం హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. కేబీఆర్‌ పార్కు వద్ద అయితే.. సైకిల్‌ ట్రాక్‌ను కార్లు, ఆటోల యజమానులు పార్కింగ్‌ కేంద్రంగా వాడుకున్నారు. అలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ కొత్త డిజైన్‌ను రూపొందించింది. సైకిల్‌ ట్రాక్‌ పొడవునా రోడ్డును విభజిస్తూ ఫైబర్‌ డబ్బాలు, దిమ్మెలతో విభాగిని నిర్మిస్తోంది. వర్షపునీరు అటు, ఇటు సాగిపోయేలా మధ్య మధ్యలో సందు వదులుతోంది. ఫలితంగా సైకిళ్లకు కేటాయించిన మార్గంలో ఇతర వాహనాలు ప్రవేశించే అవకాశం లేకుండా పోయింది. కొత్త తరహా ట్రాక్‌ను ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కొండాపూర్‌, నానక్‌రామ్‌గూడ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.  

ప్రధాన రహదారుల ఎంపిక..

ప్రధాన రహదారి వెడల్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డు, కాలిబాట, సర్వీసు రోడ్డు, సైకిల్‌ ట్రాక్‌లను వరుసగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అందుకుగాను జీహెచ్‌ఎంసీ 20 ప్రాంతాలను ఎంపిక చేసింది. ఐటీకారిడార్‌లోని పలు రోడ్డు మార్గాలతోపాటు, షేక్‌పేట రహదారి, ఎల్బీనగర్‌ కూడలి నుంచి విజయవాడ హైవే వైపు, నాగోల్‌, కామినేని కూడలి, ఉప్పల్‌, హబ్సిగూడ నుంచి మెట్టుగూడ వరకు, ఒవైసీ ఆసుపత్రి నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా, తదితర రోడ్డు మార్గాలు జాబితాలో ఉన్నాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts