logo

కబళిస్తున్న ముప్పు.. యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌

జ్వరం.. దగ్గు.. జలుబు.. తదితర చిన్న చిన్న అనారోగ్యాలకు వాడుతున్న యాంటీ బయోటిక్‌ మందులు సరిగా పని చేయడం లేదు.

Published : 14 Mar 2023 02:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: జ్వరం.. దగ్గు.. జలుబు.. తదితర చిన్న చిన్న అనారోగ్యాలకు వాడుతున్న యాంటీ బయోటిక్‌ మందులు సరిగా పని చేయడం లేదు. రెండు, మూడు దశాబ్దాలుగా విపరీతంగా వినియోగించడం, కొవిడ్‌ సమయంలో అధిక సామర్థ్యం కలిగిన మందుల వాడకమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిని ‘యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌’ అంటారు. ఈ కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల మంది చనిపోతున్నారంటూ ప్రముఖ అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ లాన్సెట్‌ గతేడాది ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతమూ అదే పరిస్థితి నెలకొందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పు నుంచి బయట పడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పర్యావరణ సంస్థతో సహా మరో రెండు సంస్థలు కార్యచరణ ప్రకటించినట్లు ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.రంగారెడ్డి తెలిపారు.

అప్పుడే చెప్పారు.. రెండో ప్రపంచ యుద్ధంలో గాయపడ్డ సైనికుల చికిత్సకు అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ను కనుగొన్నారు. ఇదే తొలి యాంటీ బయోటిక్‌. దీని కారణంగా రోగనిరోధక శక్తి పెరిగింది. పరిమితికి మించి వినియోగిస్తే.. పెన్సిలిన్‌ పని చేయని స్థితికి చేరుతుందని ఫ్లెమింగ్‌ అప్పట్లోనే చెప్పారు. తర్వాత కాలంలో పెన్సిలిన్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో దాని స్థానంలో సల్ఫనమైడ్స్‌ గ్రూపులకు చెందిన మందులను యాంటీ బయోటిక్‌గా వినియోగించారు.20 ఏళ్ల నుంచి కొత్త యాంటీ బయాటిక్స్‌ రావడం లేదు.


అందరికీ అవసరం లేదు

- డాక్టర్‌ రంగారెడ్డి, అధ్యక్షుడు, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా

స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నవారికి యాంటీ బయాటిక్స్‌ అవసరం లేదు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు వాడాల్సిన యాంటీ బయాటిక్‌ను.. వైరల్‌ జబ్బులకు వాడుతున్నాం. కరోనా సమయంలో విపరీతంగా వాడారు. మందుల అవసరం రాకుండా సహజ పద్ధతుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రాధాన్యమివ్వాలి. నిత్యం వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని