logo

చరవాణి హ్యాక్‌ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా

మొబైల్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్‌కు ‘మీ ఖాతా బ్లాక్‌ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది.

Published : 23 Apr 2024 04:17 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: మొబైల్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్‌కు ‘మీ ఖాతా బ్లాక్‌ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. అన్‌లాక్‌ కావాలంటే క్లిక్‌ చేయాలంటూ ఓ లింక్‌ పంపించారు. క్లిక్‌ చేయగా.. వెంటనే ఫోన్‌లో పాప్‌ యాప్‌లు వచ్చాయి. నేరస్థుడు స్క్రీన్‌ మిర్రరింగ్‌ యాక్సెస్‌తో ఫోన్‌ హ్యాక్‌ చేశాడు. ఒక్కసారిగా దానికదే స్విచ్ఛాఫ్‌ అయ్యి అయి కొద్దిసేపటికే రీస్టార్ట్‌ అయింది. కొన్ని నిమిషాలకు బాధితుడికి మెయిల్‌ వచ్చింది. కునాల్‌, కునా అనే రెండు పేర్లు బాధితుడి బ్యాంక్‌ ఖాతాతో జోడించబడ్డారు. అప్రమత్తమైన బాధితుడు బ్యాంక్‌ యాప్‌ను తెరిచి తనిఖీ చేస్తుండగా.. నేరస్థుడు ఫోన్‌ చేశాడు. మీకో ఓటీపీ వచ్చింది. ఆ నంబరు చెప్తే ఖాతా సేవలు పునఃప్రారంభమవుతాయని చెప్పాడు. బాధితుడు అప్రమత్తమై ససేమిరా అనడంతో నేరస్థుడు ఫోన్‌ కట్‌ చేశాడు. వెంటనే బాధితుడు బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి తన ఖాతా సేవలు నిలిపివేయాలని అభ్యర్థించాడు. మరుసటి రోజు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా బాధితుడి రోజువారీ లావాదేవీల పరిమితి రూ.50 లక్షలకు పెరిగినట్లు ఈ-మెయిల్‌ వచ్చింది. దీనికి సంబంధించిన ఓటీపీలు వచ్చాయి. కొద్దిక్షణాల్లోనే మీ ఖాతాలోంచి డబ్బులు మొత్తం మరో ఖాతాలోకి క్రెడిట్‌ అయ్యాయంటూ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. బ్యాంక్‌ అధికారులను సంప్రదించగా రూ.40.74 లక్షలు బదిలీ అయినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని