logo

ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి

అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 24 Apr 2024 05:03 IST

సీఎం రేవంత్‌రెడ్డి

మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

నారాయణపేట, మద్దూరు, కోస్గి, న్యూస్‌టుడే: అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిన కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మొదటిసారి 7500 మెజార్టీతో విజయం సాధించానని, ఇటీవలి ఎన్నికల్లో 33వేల మెజార్టీతో కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రానికి సీఎంని అందించారని వ్యాఖ్యానించారు. డెబ్బై ఏళ్లుగా అభివృద్ధి పరంగా నియోజకవర్గానికి అన్యాయం జరిగిందన్నారు. 1967లో అచ్యుతారెడ్డి మంత్రిగా పనిచేశారని, గుర్నాథ్‌రెడ్డి, నందారం వెంకటయ్య పలుమార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినా మంత్రి యోగం దక్కలేదన్నారు. ఆ లోటును భర్తీచేస్తూ  సోనియాగాంధీ కొడంగల్‌కు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు పదవులు ఇచ్చారన్నారు. గతంలో సాగు, తాగునీరు, పెట్టుబడుల విషయంలో వివక్షకు గురయ్యామన్నారు. కృష్ణా- వికారాబాద్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు కాలేదన్నారు. చిన్న సీసీ రోడ్డు కావాలన్నా, మురుగు కాల్వలు కావాలన్నా..ఏపనికైనా హైదరాబాద్‌ వెళ్లి చేయిచాచే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు తాను పాలించే స్థాయిలో ఉన్నా బేషజాలకు పోకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొడంగల్‌ అభివృద్ధిని చూసి భారాస, భాజపాలు నాటకాలు ఆడుతున్నాయని, కొడంగల్‌ ప్రజలు వీరిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లో రూ.5వేల కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. పేట-కొడంగల్‌ పథకానికి అప్పట్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ డీకే అరుణ అడ్డుపడ్డారని విమర్శించారు. ఆ పథకాన్ని ఇప్పుడు పట్టాలకెక్కిస్తే చూస్తూ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆమె అభివృద్ధి ఏం చేశారని సీఎం ప్రశ్నించారు.  

ఓర్వలేక కుట్రలు

తొలినాళ్లలో పాలమూరుకు చెందిన బూర్గుల రామకృష్ణరావు సీఎం అయితే, 70 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ప్రాంతీయుడికి అవకాశం వచ్చిందన్నారు. ఓర్వలేక కొందరు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటే మీరందరూ చూస్తూ  ఊరుకుంటారా? అని కార్యకర్తలను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అన్ని పార్టీలు జెండాలు పక్కనబెట్టి పాలమూరు అభివృద్ధికోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. నా బలగం, బంధువులు కొడంగల్‌ ప్రజలేనని..50వేల మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే 20 రోజులు అత్యంత కీలకమని, రెండు విడతలుగా ప్రతికార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలన్నారు. మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఓట్లు అడగాలని కోరారు.

మద్దూరులో సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ కార్యకర్తలు


పోటీలో ఉన్నది రేవంత్‌రెడ్డే: వంశీచంద్‌

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడతానన్నారు. దిల్లీలో పాలమూరు గళం వినిపించి నిధులు తెస్తానన్నారు. ఒకప్పుడు పాలమూరు ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పాలమూరు బిడ్డ రేవంత్‌రెడ్డిని ఆ రాష్ట్రాల నాయకులు ప్రచారానికి పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్నది రేవంత్‌రెడ్డి అని ప్రతికార్యకర్త గుర్తించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సీ రాములునాయక్‌, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, కొడంగల్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని