logo

ఆన్‌లైన్‌ రుణం.. తీసుకోకున్నా నరకం

లోన్‌యాప్‌ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్‌ల ద్వారా రుణం ఇచ్చి..

Updated : 24 Apr 2024 05:06 IST

- కొత్త తరహాలో లోన్‌యాప్‌ నేరగాళ్ల వేధింపులు

ఈనాడు, హైదరాబాద్‌: లోన్‌యాప్‌ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్‌ల ద్వారా రుణం ఇచ్చి.. రోజుల వ్యవధిలో ఐదారు రెట్లు వసూలు చేయడం, లేకుంటే వేధించేవారు. అసలు రుణం తీసుకోకున్నా ఎంతోకొంత బ్యాంకు ఖాతాలో జమ చేసి తిరిగి వడ్డీతో సహా కట్టాలంటూ ఫోన్లు చేయడం.. అసలు రుణం తీసుకోకున్నా అప్పు తీసుకున్నావంటూ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల నగర పోలీసులకు ఈ తరహా ఫిర్యాదులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై 3 కమిషనరేట్ల సైబర్‌క్రైమ్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో వెయ్యికిపైగా యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు. ఒక్క సైబరాబాద్‌ పోలీసులే సుమారు 600దాకా యాప్‌లు తొలగించారు. గత ఏడాది రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు లోన్‌యాప్‌ ముఠాను అరెస్టు చేసినప్పుడు ఈ మోసం వెలుగుచూసింది. నగరానికి చెందిన అబ్దుల్‌ బారీకి ఒకసారి లోన్‌యాప్‌ ద్వారా రుణం తీసుకుని తిరిగి కట్టాడు. నేరగాళ్లు కొన్నిరోజుల తర్వాత అడగకుండానే రూ.10 వేలు అతని ఖాతాలో జమ చేసి వడ్డీల రూపంలో రూ.2.49 లక్షలు వసూలు చేశారు.

డేటాతోనే అంతా సమస్య..!

బ్యాంకు ఖాతాదారుల డేటా అంగట్లో సరకులా మారడమే ఈ తరహా వేధింపులకు కారణమని పోలీసులంటున్నారు. బ్యాంకు ఏదైనా ఖాతాదారుల పేరు, ఫోన్‌ నంబర్లు, చిరునామా, నామినీ, లావాదేవీల వివరాలు బయటకు పొక్కుతున్నాయి. వీటిని సేకరిస్తున్న రుణయాప్‌ నిర్వాహకులు ఈ తరహా నేరాలకు దిగుతున్నారు. కొందరు అత్యవసర సందర్భాల్లో లోన్‌యాప్‌ నుంచి రూ.10 వేల లోపు రుణాలు తీసుకుని తిరిగి కట్టేస్తారు. ఇలాంటి వారు మళ్లీ రుణం తీసుకోకపోయినా నేరగాళ్లు మాత్రం ఎంతోకొంత డబ్బు జమ చేస్తారు. ఆ తర్వాత ఫోన్‌ చేసి నరకం చూపిస్తారు.  

ఇలా వేధింపులు..

  • నగరానికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు మార్చిలో తన ఫోన్‌లో స్పీడ్‌ లోన్‌ యాప్‌ను పొరపాటున క్లిక్‌ చేయగా రూ.5 లక్షల రుణం మంజూరైనట్లు చూపించింది. ఆమె ప్రమేయం లేకుండానే రూ.2,160 చొప్పున మూడు సార్లు కలిపి రూ.6,480 జమ చేశారు. కొన్నిరోజుల తరువాత కొందరు ఫోన్‌ చేసి రుణం తిరిగివ్వాలని డిమాండ్‌ చేస్తూ వేధించారు. బాధితురాలు మూడు దఫాల్లో రూ.9600 చెల్లించినా బెదిరింపులు ఆగలేదు. ఆమె వ్యక్తిగత చిత్రాలను నగ్నంగా మార్చి వాట్సాప్‌, ఆమె ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లకు పంపిస్తున్నారు.
  • ఇంజినీరింగ్‌ విద్యార్థికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. లోన్‌యాప్‌ నుంచి మాట్లాడుతున్నామని, ఇటీవల తీసుకున్న రూ.2 వేలకు వడ్డీతో కలిపి రూ.3500 కట్టాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి మాత్రం తాను డబ్బు తీసుకోలేదని పదేపదే చెప్పినా వేధించారు. కొద్దిసేపటి తరువాత విద్యార్థి తండ్రికి ఫోన్‌ చేశారు. డబ్బు ఎందుకు ఇవ్వాలని తండ్రి ప్రశ్నించగా వాట్సాప్‌లో ఆయన నగ్న చిత్రాలు పంపి బెదిరించారు. డబ్బు తీసుకోకున్నా కట్టాలంటూ వేధించడంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇవీ జాగ్రత్తలు

  • లోన్‌యాప్‌ పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మొద్దు. వీటిద్వారా రుణం తీసుకోవద్దు.
  • అసలు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకున్నా.. రుణం తీసుకోకున్నా ఎవరైనా డబ్బు కట్టాలని ఫోన్లు చేస్తే నమ్మొద్దు.
  • పదేపదే ఫోన్‌ చేసి వేధించినా..నగ్న చిత్రాలు పంపించినా వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని