logo

బడి బయటి పిల్లలు ఎందరు?

బడికెళ్లాల్సిన పిల్లలు పేదరికంతో పనుల్లో మగ్గుతున్నారు. ఇటుక బట్టీలు, కార్ఖానాల్లో బాల్యం మసక బారుతోంది. బడి ఈడు పిల్లలు చదువులకు దూరమవుతుండటంతో భవిత అయోమయంగా మారింది. విద్యాహక్కు

Published : 23 Jan 2022 02:25 IST

జిల్లాలో కొనసాగుతున్న సర్వే..

26లోపు తుది జాబితా ఖరారు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

పెద్దపల్లిలో సర్వే చేస్తున్న సీఆర్పీ

బడికెళ్లాల్సిన పిల్లలు పేదరికంతో పనుల్లో మగ్గుతున్నారు. ఇటుక బట్టీలు, కార్ఖానాల్లో బాల్యం మసక బారుతోంది. బడి ఈడు పిల్లలు చదువులకు దూరమవుతుండటంతో భవిత అయోమయంగా మారింది. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి వయసు పిల్లలను పాఠశాలలో చేర్పించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా నిర్బంధ విద్యను విద్యాశాఖ అమలు చేస్తోంది.

ఇందులో భాగంగా బడి బయటి పిల్లలను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. క్షేత్ర స్థాయిలో సీఆర్పీలు, ఐఆర్పీలు సర్వేలో భాగస్వాములవుతున్నారు. సిబ్బంది ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్తూ 28 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 26లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సమయం తక్కువగా ఉండటంతో గడువులోగా పూర్తి చేసేందుకు సర్వేలో వేగం పెంచారు. ఇందులో తేలిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. అయితే కరోనా మహమ్మారి, ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సిబ్బంది జంకుతున్నారు.

మసక బారుతున్న బాల్యం

ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత నేపథ్యంలో బడి ఈడు పిల్లలు చాలా మంది చదువుకు దూరంగా ఉంటున్నారు. పాఠశాలలకు వెళ్లాల్సిన వయసులో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు తాము పని చేసే పాఠశాలల పరిధిలో బడి బయటి పిల్లల ఇళ్లకు వెళ్లి పంపించాలని ఒత్తిడి తీసుకొచ్చినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా చాలా మంది బాలికలు ఇంటి వద్దే ఉంటున్నారు. సర్వేలో భాగంగా బడిఈడు పిల్లలు, దివ్యాంగ పిల్లలను వేర్వేరుగా గుర్తిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 19 మంది ఐఆర్పీలు, 51 మంది సీఆర్పీలు పరిశీలనలో పాల్గొంటున్నారు. అధికారుల సర్వేతో బడిఈడు పిల్లల సంఖ్య పక్కాగా తేలనుంది.

వలస కూలీలే అధికం

జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌, రామగిరి, మంథని మండలాల్లో ఎక్కువగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒడిశా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వేలాది కుటుంబాలు వలస వచ్చాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని పట్టణాల్లో బాలకార్మికుల సంఖ్య అధికంగా ఉంది. గతేడాది 300కు పైగా బాలకార్మికుల సంఖ్య తేలింది. ఈ సారి పిల్లల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

28 అంశాలతో సమాచార సేకరణ

* బడి బయటి పిల్లల సమాచారాన్ని 28 అంశాలతో సేకరిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో ఇలాంటి పిల్లలతో కూడిన వివరాల జాబితా ఉన్నాయి. ఈ జాబితా వెంట తీసుకొని సిబ్బంది ఇంటింటి పరిశీలన నిర్వహిస్తున్నారు.

* విద్యార్థి పేరు, ఆధార్‌ సంఖ్య, పుట్టిన తేదీ, వయసు, చరవాణి, కుటుంబ సభ్యుల జీవనాధారం, స్వశక్తి సంఘంలో సభ్యులుగా ఉన్నారా? కులం, విద్యాస్థితి? ఏ తరగతిలో బడి మానేశారు? వలస వచ్చిన వారా? తదితర వివరాలను సేకరిస్తున్నారు. ః దివ్యాంగులైన బడి బయటి పిల్లలను గుర్తించడానికి ఐఆర్పీలు సర్వే నిర్వహిస్తున్నారు. ఇటుక బట్టీలు, కార్మిక వాడలు, పరిశ్రమలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీఆర్పీలు పర్యటిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల సహకారంతో సర్వే సాగుతోంది.

* జిల్లాలో క్షేత్ర స్థాయిలో గుర్తించిన పిల్లల వివరాలతో మండల స్థాయిలో జాబితా రూపొందిస్తున్నారు. ఈ జాబితాను మరోసారి పరిశీలించి తప్పులుంటే సవరిస్తారు. ఈ నెల 26లోగా విద్యాశాఖ రూపొందించిన ‘ప్రబంధ్‌’ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.

పకడ్బందీగా సర్వే నిర్వహణ: విజయ్‌కుమార్‌, సమగ్ర శిక్ష జిల్లా సమన్వయకర్త

జిల్లాలో సీఆర్పీలు, ఐఆర్పీలు వేర్వేరుగా సర్వే నిర్వహిస్తున్నారు. పాఠశాలకు దూరంగా ఉండే పిల్లల గుర్తింపులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరిశీలన జరపాలని ఆదేశించాం. పల్లెలు, పట్టణాల్లో సిబ్బంది పకడ్బందీగా సర్వే చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని