logo

బడిలో తొలిమెట్టు

ప్రభుత్వ పాఠశాలల బాలల్లో తరగతులకు తగినట్లుగా సామర్థ్యాలు లేకపోవడం, కొవిడ్‌ కారణంగా రెండేళ్లు ప్రత్యక్ష తరగతులకు దూరమవడంతో విద్యార్థులు చదవడం, రాయడంలో వెనుకంజలో నిలుస్తున్నారు. భాష, గణిత సామర్థ్యాల్లో వారు ఆశించిన రీతిలో

Published : 01 Aug 2022 04:57 IST

1-5 తరగతుల బాలల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు చర్యలు
జిల్లా ఉపాధ్యాయులకు మొదలైన శిక్షణ
న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం

శిక్షణలో ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల బాలల్లో తరగతులకు తగినట్లుగా సామర్థ్యాలు లేకపోవడం, కొవిడ్‌ కారణంగా రెండేళ్లు ప్రత్యక్ష తరగతులకు దూరమవడంతో విద్యార్థులు చదవడం, రాయడంలో వెనుకంజలో నిలుస్తున్నారు. భాష, గణిత సామర్థ్యాల్లో వారు ఆశించిన రీతిలో ప్రతిభను చూపలేకపోతున్నారు. ఇది వరకు చదువుకుతున్న తరగతుల్లో నేర్చుకున్నది కూడా మరిచిపోయారు. విద్యార్థులు చదువుల్లోని అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు గత ఏడాది కేంద్రం నిర్వహించిన జాతీయ సాధన సర్వే(నాస్‌)లో కూడా వెనుకంజలో ఉన్నట్లు తేలింది. చదువులకు పునాదిగా నిలిచే ప్రాథమిక స్థాయిలో ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమం ఆగస్టు 15 నుంచి ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహించనుంది. ఏడాది పొడవునా కార్యక్రమం అమలు చేయనున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు రెండు దఫాలుగా జిల్లా విద్యాశాఖ నిర్వహించే శిక్షణ కార్యక్రమం జులై 30 న ప్రారంభించింది.

పాఠశాలలకు పంపిణీ చేసిన తొలిమెట్టు పుస్తకాలు

నేర్పిస్తారు..
జిల్లాలో ప్రభుత్వ పరంగా 468 ప్రాథమిక, 25 ప్రాథమికోన్నత పాఠశాలలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో కొనసాగుతున్నాయి. మరో 8 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉర్దూ మాధ్యమంలో ఉన్నాయి. వాటిల్లో 1046 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, 1-7 తరగతుల్లో 33,823 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి విద్యార్థి భాషల్లో చదవడం, రాయడం, గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారం లెక్కలు చేసేలా ప్రత్యేకంగా బాలలకు వాటిని ఉపాధ్యాయులు నేర్పించనున్నారు. రెగ్యులర్‌ తరగతులతో పాటు ఈకార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేయనున్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపనున్నారు.

తొలిమెట్టు కార్యక్రమం అమలుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ జులై 26 నుంచి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రతి మండలానికి నలుగురి చొప్పున ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. జిల్లాలోని ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు కూడ శిక్షణను నిర్వహిచారు. ప్రతి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మండలాల వారీగా రెండు దఫాలుగా శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ జులై  30 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు, ఆగస్టు 3 నుంచి 16వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. తొలిమెట్టు అమలుకు  పుస్తకాలను ప్రతి పాఠశాలలకు ఒక సెట్‌ చొప్పున పంపిణీ చేసినట్లు సమగ్ర శిక్ష జిల్లా కో-ఆర్డినేటర్‌ కె.ఆశోక్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని