logo

పనుల్లో నిర్లక్ష్యం.. నాణ్యత గగనం..!

రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్న వివిధ ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా రైల్వేశాఖ రద్దీ ప్రదేశాల్లో రైల్వే అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)లను నిర్మిస్తోంది. కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో రైల్వే ఇంజినీరింగ్‌ శాఖ నిర్వహణ చేపడుతోంది.

Published : 08 Aug 2022 05:34 IST

రైల్వే అండర్‌ బ్రిడ్జిల నిర్మాణాల్లో లోపాలు


జలాశయం కాదిది.. ఉప్పరపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి మార్గం

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్న వివిధ ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా రైల్వేశాఖ రద్దీ ప్రదేశాల్లో రైల్వే అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)లను నిర్మిస్తోంది. కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో రైల్వే ఇంజినీరింగ్‌ శాఖ నిర్వహణ చేపడుతోంది. ప్రధానంగా ఈ ఆర్‌యూబీల ఉద్దేశం గేట్‌మెన్ల అవసరం లేకుండా, ఆటోమేటిక్‌ గేట్లు ఎత్తివేసి రైళ్ల రాకపోకలు సజావుగా సాగేలా చేపట్టడమే. ఈ లక్ష్యానికి అధికారులు, గుత్తేదారులు తూట్లు పొడిచే విధంగా నిర్మాణాలు నాణ్యత లేకుండా చేపడుతున్నారనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. జిల్లాలో పెద్దంపేట, రామగుండం జంక్షన్‌, రాఘవపురం, పెద్దపల్లి జంక్షన్‌, కొత్తపల్లి, కొలనూర్‌, ఓదెల, పొత్కపల్లి పరిధిలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఓదెల మండలంలోని కొత్తపల్లి, ఉప్పరపల్లి, హరిపురం గ్రామాల్లో ఆర్‌యూబీలు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణ నాణ్యత లోపభూయిష్టంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మించకముందే నీటిలో మునిగాయి. సరైన సిమెంట్‌, ఇసుక, కంకర మిశ్రమాలు తయారుచేసి గోడలను నిర్మించకపోవడంతో అప్పుడే పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల మూలంగా ఆర్‌యూబీల మార్గాలన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. సిమెంట్‌ దిమ్మెలు అందులో మునిగిపోయి శిథిలమైపోతున్నాయి. ఇప్పటికైనా రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, గుత్తేదారులతో నాణ్యమైన పనులు చేయించాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆర్‌యూబీల్లోనూ మైనస్‌ టెండర్‌..?

ఉప్పల్‌ ఆర్వోబీ విషయంలో కొందరు అధికారులు, గుత్తేదారులు కుమ్మకై ప్రాజెక్టు ఆకృతిని మార్చి మైనస్‌ టెండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలతో ఏకంగా సీబీఐ చేతికి సదరు అధికారి చిక్కారు. తక్కువ కోట్‌ చేసినవారికే రైల్వే పనులు అప్పగిస్తుండగా ఇక్కడే అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్‌యూబీల్లోనూ మైనస్‌ టెండర్స్‌ జరిగి ఉంటాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపల్లి నుంచి కొత్తపల్లి వెళ్లే మార్గంలో నిర్మాణ దశలో నిండిన వర్షపునీటిని మోటార్లతో తోడేస్తున్న దృశ్యం


పట్టాలపై రద్దీ నివారణ.. గేట్‌మెన్‌ రహిత వ్యవస్థ

పట్టాలపై రద్దీ నివారించేందుకు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆర్వోబీ, తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆర్‌యూబీలను రైల్వేశాఖ నిర్మించ తలపెట్టింది. రైల్వే శాఖ గతంలో బడ్జెట్‌లో ప్రస్తావించిన గేట్‌మెన్‌ రహిత రైల్వే ట్రాఫిక్‌ రద్దీ ఏర్పాటు చర్యలను ముమ్మరం చేయడంలో భాగంగానే ఈ పనులు నిర్వహిస్తున్నారు. గేట్‌మెన్లు, అడుగడుగునా ఆటోమేటిక్‌ రైల్వే గేట్‌ లాకింగ్‌ సిస్టం లేకుండానే రైల్వేతో పాటు వాహనాల రాకపోకలు ఎక్కడా స్తంభించకుండా చేసేందుకు వీటి నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

* పెద్దపల్లి జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి వ్యవసాయ, ఇసుక, బియ్యం, ఇతరత్రా ముడిసరకుల కోసం రాకపోకలు సాగించే భారీ వాహనాలతో రద్దీ పెరిగిపోతుంది. దీంతో రైల్వే, ర.భ.స శాఖలు రూ.200 కోట్ల ఖర్చు అంచనాతో అవసరమైన ఆర్వోబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి.


అవినీతి అధికారుల వెన్నులో వణుకు

ఇప్పటికే ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో నిర్మిస్తున్న ఆర్వోబీ డిజైన్‌ మార్పుకు గుత్తేదారు వద్ద నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏకంగా సీబీఐకి దొరికారు. ఈ ఘటన మరవకముందే హైదరాబాద్‌లోని తార్నాకలో ఓ రైల్వే గుత్తేదారు ఇంటిపై ‘ఈడీ’దాడులు రైల్వేశాఖలోనే సంచలనంగా మారింది. రైల్వే పనుల నకిలీ బిల్లుల వ్యవహారం ఒకొక్కటి బయటపడుతుండటంతో రైల్వే అధికారుల వెన్నులో వణుకు పుడుతోంది.

* కాజీపేట-బల్లార్షా మూడోలైన్‌ నిర్మాణానికి సంబంధించి గుత్తేదారుల బిల్లులు చెల్లించడం, ప్రతిపాదనలు, పర్యవేక్షణల కోసం ప్రత్యేకంగా రామగుండం, పెద్దపల్లి, ఓదెల, కొత్తపల్లి ప్రాంతాల్లో కార్యాలయాలు నిర్మించారు. నిబంధనల ప్రకారం జరిగాయా? లేదా ఇంకేమైనా మార్పులు జరిగాయా? అన్న వివషయమై రైల్వే ఉన్నతాధికారులు త్వరలో ఈ కార్యాలయాల్లోని రికార్డులను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు సమాచారం అందడంతో అధికారుల గుండెల్లో దడ మొదలైంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని