logo

రాఖీ కట్టించుకొని.. ఆనందంగా విధులకెళ్లి.. ఒప్పంద కార్మికుని హఠాన్మరణం

ఆయనకు సంతానంగా ఇద్దరూ కుమారులే.. రాఖీ రోజు అన్నయ్య ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను ఇంటికి తీసుకొచ్చుకొని తనతో పాటు ఇద్దరు కుమారులకు రాఖీ కట్టించుకొని ఆనందంగా గడిపారు.. అనంతరం సంతోషంగా విధుల్లోకి వెళ్లిన

Published : 13 Aug 2022 04:07 IST

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో విషాదం

తన అన్న కూతురు సంకేతికతో శుక్రవారం

ఉదయం రాఖీ కట్టించుకుంటున్న రమాపతి

ఫెర్టిలైజర్‌ సిటీ, న్యూస్‌టుడే : ఆయనకు సంతానంగా ఇద్దరూ కుమారులే.. రాఖీ రోజు అన్నయ్య ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను ఇంటికి తీసుకొచ్చుకొని తనతో పాటు ఇద్దరు కుమారులకు రాఖీ కట్టించుకొని ఆనందంగా గడిపారు.. అనంతరం సంతోషంగా విధుల్లోకి వెళ్లిన ఓ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఒప్పంద కార్మికుడు పూరేళ్ల రమాపతి(42) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులైన తోటి కార్మికుల కథనం ప్రకారం.. రామగుండం ఎరువుల కర్మాగారంలోని స్టోర్స్‌లో ఒప్పంద కార్మికునిగా పనిచేస్తున్న గోదావరిఖనికి చెందిన రమాపతి శుక్రవారం మధ్యాహ్నం విధులు ముగించుకొని అందరితో కలిసి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలాగే నిద్రపోయిన ఆయన కొద్ది సేపట్లోనే ఊపిరి ఆడకపోవడంతో కొట్టుకుంటుండగా తోటి కార్మికులు గుండెపై నొక్కుతూ ప్రయత్నించడంతో పాటు వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు జ్యోతినగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకోగా గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రిలో శవపంచనామా చేశారు. రెండేళ్లుగా ఉదయం షిఫ్టులోనే పనిచేస్తున్న రమాపతి ప్రతి రోజు భోజనం చేశాక విశ్రాంతి వేళలో ఇంటికి ఫోన్‌ చేసి మాట్లాడుతుంటాడు. యథావిధిగా శుక్రవారం సైతం మధ్యాహ్నం వేళ ఫోన్‌ చేస్తాడని ఎదురుచూస్తున్న సమయంలోనే ఆయన మృతి వార్త వినాల్సి వచ్చిందని ఆయన భార్య రోదిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. కొంతకాలంగా శ్రీరాంపూర్‌లో నివాసం ఉంటుండగా, ఆరు రోజుల క్రితమే గోదావరిఖనిలోని ద్వారకానగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. నిరంతరం నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే రమాపతి మృతిని తట్టుకోలేకపోతున్నామని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ నాయకులు బూర్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు అంబటి నరేశ్‌ తదితరులు ఆస్పత్రిలో రమాపతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నష్టపరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. రామగుండం సీఐ లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని