logo

పారదర్శకం... పంచాయతీల ఆర్థిక వ్యవహారాలు

తెలంగాణ ప్రభుత్వం ఈ-పంచాయతీ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 2015లో ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగానే ఈ- పంచాయతీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో 180 క్లస్టర్ల ద్వారా 37 మంది కంప్యూటర్‌ ఆపరేటర్ల ద్వారా ఈ- పంచాయతీ సేవలు వంద శాతం కొనసాగుతున్నాయి.

Published : 04 Oct 2022 05:47 IST

ఈ-గ్రామస్వరాజ్‌లో నిధుల సమాచారం

న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం

యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న పంచాయతీ వివరాలు

తెలంగాణ ప్రభుత్వం ఈ-పంచాయతీ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 2015లో ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగానే ఈ- పంచాయతీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో 180 క్లస్టర్ల ద్వారా 37 మంది కంప్యూటర్‌ ఆపరేటర్ల ద్వారా ఈ- పంచాయతీ సేవలు వంద శాతం కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఈ - గ్రామ స్వరాజ్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, వాటి ఖర్చులు సహా పంచాయతీల ఆదాయ వివరాలను ఎప్పుటికప్పుడు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి. గతంలో ఏ పనికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు తెలుసుకోవాలన్నా సరైన సమాచారం లభించేది కాదు. ఉన్నతాధికారుల దృష్టికి పౌరులు తీసుకెళ్లినా స్పందన ఆశించిన విధంగా ఉండేది కాదు. ఈ ఇబ్బందులను అధిగమించి పంచాయతీల పాలన మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ- గ్రామ స్వరాజ్‌ యాప్‌ను తీసుకొచ్చింది. అతి సులువుగా చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకునే వీలున్న ఈ యాప్‌ సహాయంతో సమస్త వివరాలు తెలుసుకునే వీలుంది.

ఈ- పంచాయతీ పోర్టల్‌ ద్వారా బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్స్‌, బిజినెస్‌ లైసెన్స్‌, ఆస్తి పన్ను, ప్రాపర్టీ మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్ఛు అలాగే పన్నుల చెల్లింపులు, పెన్షన్‌లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పంట ఉత్పత్తుల ధరలు, పరీక్ష ఫలితాలు, ఉద్యోగ నోటిఫికేషన్‌ల గురించి అప్‌డేట్‌లను తెలుసుకునే విధంగా విద్యార్థులకు, రైతులకు ఈ- పంచాయతీ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. దీనితోపాటు ఈ-పంచాయతీ మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే అప్లికేషన్‌ల కార్యాచరణలను ఏకీకృతం చేయడం ద్వారా ఈ- గ్రామ స్వరాజ్‌ యోజన కింద పోర్టల్‌ (యాప్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

యాప్‌ డౌన్‌లోడ్‌... పని తీరు ఇలా...

ప్రతి పౌరుడికీ అందుబాటులో సమాచారం ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. పారదర్శకంగా ఆర్థిక వ్యవహారాలు అందుబాటులోకి రావాలన్న తలంపుతో ఈ-గ్రామ స్వరాజ్‌ అనే యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దీన్ని సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్ఛు కావాల్సిన పంచాయతీ, నియోజకవర్గం వివరాలు, రాష్ట్రం, జిల్లా పరిషత్తు, మండల, పంచాయతీ పేర్లు నమోదు చేయాలి. దీంతో మూడు వివరాలున్న పేజీ కన్పిస్తుంది. అవన్నీ ఆమోదం పొందిన తర్వాత కార్యక్రమాలు, ఆర్థిక పురోగతి వివరాలున్న పుటలు కనిపిస్తాయి. వీటిలో ఏయే పనులకు ఎంత ఖర్చు చేశారన్న వివరాలు క్షణాల్లో సవివరంగా కనిపిస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లో 255 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్‌లో కనిపించనున్నాయి.

వందశాతం ఆన్‌లైన్‌లో... - రవీందర్‌, డీపీవో

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఈ- పంచాయతీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఉన్న క్లస్టర్ల ద్వారా వంద శాతం ఆన్‌లైన్‌లో పంచాయతీ సేవలు కొనసాగుతున్నాయి. పంచాయతీలకు సంబంధించిన వివరాలను సైతం గ్రామ స్వరాజ్‌ యాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం. పరిపాలన, ఆర్థిక వివరాలు పూర్తి పారదర్శకంగా అందరికీ యాప్‌లో కనిపించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని