logo

ఉమ్మడి జిల్లాకు మరో పదవి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మరో పదవి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకతను చాటిన నాలుగు జిల్లాల్లోని పలువురు కీలక నాయకులు ఇప్పటికే పలురకాల నామినేటెడ్‌ పదవులను అందుకున్నారు.

Published : 09 Dec 2022 05:51 IST

ఈసారి రవీందర్‌సింగ్‌కు దక్కిన అవకాశం

రవీందర్‌సింగ్‌

ఈనాడు, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మరో పదవి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకతను చాటిన నాలుగు జిల్లాల్లోని పలువురు కీలక నాయకులు ఇప్పటికే పలురకాల నామినేటెడ్‌ పదవులను అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాకు పదవుల పంపకంలో పెద్దపీట వేశారు. మూణ్ణెళ్ల కిందటనే టెక్‌టైల్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల జిల్లాకు చెందిన గూడురి ప్రవీణ్‌ను నియమించారు. అంతకు కొన్ని రోజుల ముందు కరీంనగర్‌కు చెందిన కుర్మాచలం అనిల్‌కు ఫిల్మ్‌, టీవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా గురువారం కరీంనగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, నగర మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కరీంనగర్‌లో రవీందర్‌సింగ్‌ కుమార్తె వివాహానికి వచ్చి వెళ్లిన తరువాత ఈ ఉత్తర్వులు వెలువడటంతో తెరాస శ్రేణుల్లో జోష్‌ కనిపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రవీందర్‌ మళ్లీ తెరాసలో చేరారు. అప్పటి నుంచీ మళ్లీ ముఖ్యమంత్రికి సన్నిహితంగానే ఉంటున్న రవీందర్‌సింగ్‌ కుమార్తె వివాహం రోజునే పదవి వరించడంతో ఆనందంలో మునిగిపోయారు.

సఖ్యత కుదిరేనా?

తెరాస స్థానిక నాయకులతో రవీందర్‌సింగ్‌ గత కొన్ని నెలలుగా అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఎక్కువగా రాష్ట్ర రాజధానిలో ఉంటూ సీఎంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌.. రవీందర్‌ సింగ్‌ కొన్నేళ్లుగా ఎవరికి వారనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెరాసలోని ముఖ్య నేతలను రవీందర్‌సింగ్‌ బాహాటంగానే విమర్శించడంతో దూరం మరింతగా పెరిగింది. తిరిగి పార్టీలోకి వచ్చిన తరువాత కూడా ఆయన సొంతంగానే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా రవీందర్‌సింగ్‌కు నామినేటెడ్‌ పదవి ఇస్తూ గంగులకు.. ఆయనకు సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారనే అభిప్రాయం గులాబీ పార్టీ నాయకుల నోట వినిపిస్తోంది. పైగా మంత్రి గంగుల పర్యవేక్షించే పౌరసరఫరాల శాఖ అనుబంధ సంస్థకు ఛైర్మన్‌గా నియమించడం కూడా కేసీఆర్‌ వ్యూహమనేది సొంత పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట.. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులను అధిగమించాలనే ఉద్దేశంతోనే పార్టీ అధినేత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వారు పేర్కొంటున్నారు. వారిద్దరు కలిసి నడిస్తే పార్టీకి మంచిదనే భావన తెరాస శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని