logo

రాజన్న గుడి.. అంతర్జాలంలో వెనకబడి

దేశంలో ప్రసిద్ధి పొందిన శైవక్షేత్రాల్లో వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం ఒకటి. దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

Published : 19 Jan 2023 05:16 IST

వెబ్‌సైట్‌ నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

రాజన్న ఆలయ వెబ్‌సైట్‌

దేశంలో ప్రసిద్ధి పొందిన శైవక్షేత్రాల్లో వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం ఒకటి. దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శివరాత్రికి రాజన్న దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు తరలి వస్తుంటారు. అలా వచ్చే భక్తులు ముందుగానే ఇక్కడి ప్రత్యేక పూజల వివరాలు, గదులు, పర్యాటక స్థలాలు ఇలా ప్రతిదీ తెలుసుకోవాలంటే అంతర్జాలం ఒక్కటే ఆధారం. కానీ ఈ విషయంలో భక్తులకు నిరాశే ఎదురవుతోంది. ఆలయ అధికారిక వెబ్‌సైట్‌ నిర్వహణను గాలికొదిలేయడమే ఇందుకు కారణం. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడి రద్దీ, వసతులను చూసి ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో విస్తరించిన సేవలు, వసతితోపాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలు, విరాళాలు అందించే సమాచారం వంటివి ఇక్కడికి వచ్చాకే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచమంతా అంతర్జాలం, యాప్‌లు వంటి సాంకేతికను అందిపుచ్చుకునేందుకు పరుగులు తీస్తుంటే రాజన్న ఆలయ అధికారులు మాత్రం బాగా వెనకబడ్డారు.

2016 నాటి సమాచారం

పునరుద్ధరిస్తే..

ప్రముఖ క్షేత్రం కావడంతో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. దూరపు ప్రాంతాల వారు అధికంగా వస్తుంటారు. ఆలయ వెబ్‌సైట్‌ని ఆధునికీకరించడంతో పాటు యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. ఆలయ ఆదాయంతో పోలిస్తే వీటి నిర్వహణ ఏ మాత్రం భారం కాదు. వెబ్‌సైట్‌లో గుడిలో రోజువారీ పూజల వివరాలతో పాటు ఇతర కార్యక్రమాల వివరాలను నవీకరించారు. గదుల ఖాళీలు, ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల టికెట్ల బుకింగ్‌ సదుపాయం కల్పించవచ్చు. ఇక యాప్‌లో వీడియోలు, చిత్రాలు ఉంచాలి. ఆలయ నిర్మాణ పనుల వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి.

వేములవాడ వైభవం

వేములవాడ చాళుక్యుల రాజధాని, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా నిలిచినట్లు కొల్లిపర, పర్భణి శాసనాలు చెబుతున్నాయి. జైన మతం ప్రాచుర్యంలో ఉండేది. ఇక్కడి భీమేశ్వరాలయానికి ఎన్నో విశేషాలున్నాయి. ఇలా చరిత్ర విశేషాలు వెబ్‌సైట్‌లో పెడితే వేములవాడ వైభవం విశ్వవ్యాప్తం అవుతుంది. అలాగే రాజన్న గుడితోపాటు బద్దిపోచమ్మ, నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామి, అగ్రహారం అంజన్న ఆలయాలతోపాటు మధ్యమానేరుకు రాజరాజేశ్వర జలాశయంగా నామకరణం చేశారు. ఇలా గతం, ప్రస్తుత సమాచారం, ఎలా వెళ్లాలో వివరిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా మహా శివరాత్రి వంటి ప్రత్యేక సందర్భాల్లో దూర ప్రాంత భక్తులు ఎలా రావాలి, ఇక్కడున్న దర్శణీయ స్థలాలు, వాటి ప్రాముఖ్యతలు తెలుసుకుని ప్రణాళికను రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఆలయ అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

ఆరేళ్ల నాటి సమాచారం

ఇది సమాచార సాంకేతిక యుగం. ఏది తెలుసుకోవాలన్నా అంతర్జాలమే ఆధారం. గతంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల పేరిట అధికారిక వెబ్‌సైట్‌లు నిర్వహించేవారు. అయితే యాప్‌లు వెల్లువ తర్వాత చాలా వరకు ఆయా దేవాలయం పేరిట ప్రత్యేక యాప్‌లు ప్రవేశపెట్టి భక్తులకు సమాచారం అందిస్తూ మరింత చేరువవుతున్నాయి. అయితే రాజన్న ఆలయానికి సంబంధించి ఇవేమీ కనిపించవు. పాత సమాచారమే కనిపిస్తుంది. 2016లో చివరిసారి వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని