logo

ఆధార్‌తో జత.. పనిలో పారదర్శకత!

ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసే క్రతువులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జోరు చూపిస్తోంది. పని ప్రదేశంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కీలకమైన ఆధార్‌ అనుసంధానంలో నాలుగు జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.

Published : 06 Feb 2023 02:36 IST

ఉమ్మడి జిల్లాలో వేగంగా ప్రక్రియ

ఈనాడు, కరీంనగర్‌: ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసే క్రతువులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జోరు చూపిస్తోంది. పని ప్రదేశంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కీలకమైన ఆధార్‌ అనుసంధానంలో నాలుగు జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. దాదాపు 94 శాతం జాబ్‌కార్డుతో జత చేశాయి. ఈ విధానాన్ని వేగంగా అమలు చేస్తున్న జిల్లాల జాబితాలో మన జిల్లాలు అగ్రభాగాన ఉన్నాయి. జనవరి మొదటి వారంలో ప్రారంభమైన కార్యక్రమం మరో వారం రోజుల్లో శతశాతాన్ని చేరుకోనుంది. మొదట్లో క్షేత్ర స్థాయిలో ఈ పని మందకొడిగా కనిపించినా.. గత నెలాఖరులో మాత్రం చివరి దశకు చేరుకుంటుంది.  


అవకతవకలు తొలిగేలా..!

ఊరూరా చేపడుతున్న పనుల్లో అసలు తప్పులకు చోటులేకుండా పనిని సజావుగా, పారదర్శకంగా జరిపించే ఉద్దేశంతో గత నెల మొదటి రోజు నుంచి ఆన్‌లైన్‌ హాజరును తెరపైకి తీసుకొచ్చారు. గతంలో సామాజిక తనిఖీల సమయంలో బయటపడ్డ నిధుల దుర్వినియోగం, అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అసలు కూలీలు పనికి రాకుండానే దినసరి వేతనాలను కాజేసిన ఉదంతాలు కోకొల్లలు. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఊళ్లల్లో చేపట్టే ప్రతి పని పక్కాగా జరపాలనే సదుద్దేశంతోపాటు ప్రజల సొమ్మును సరైన పనులకు వినియోగించుకునే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పనికి సక్రమంగా వచ్చే వారి వివరాలను నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ యాప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)లో పొందుపర్చారు. గతంలోనే ఆధార్‌తో జత కలిసిన కార్డులను గుర్తించడంతోపాటు కొత్త జాబ్‌కార్డులను జత చేసే పనిలో ఉపాధి హామీ సిబ్బంది నిమగ్నమయ్యారు. చాలాచోట్ల పేర్లు, వయసు సహా ఇతరత్ర ఇక్కట్లతో అనుసంధానంలో తిరస్కరణకు గురవుతున్న వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. వీటిని మరోమారు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని