logo

చిచ్చర పిడుగు

పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా రెండున్నరేళ్ల ప్రాయంలోనే ఓ చిన్నారి శ్లోకాలు చెప్పడంలో ప్రతిభ చూపుతోంది. కొందరు పిల్లలు ప్రపంచంలోని దేశాలు, కరెన్సీ పేర్లు, ప్రముఖుల పేర్లు చెబుతుంటారు.

Published : 09 Feb 2023 05:24 IST

రెండున్నర ఏళ్లకే శ్లోకాలు చెబుతున్న చిన్నారి
ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

చిన్నారి ప్రదాత్రి

గంగాధర, కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా రెండున్నరేళ్ల ప్రాయంలోనే ఓ చిన్నారి శ్లోకాలు చెప్పడంలో ప్రతిభ చూపుతోంది. కొందరు పిల్లలు ప్రపంచంలోని దేశాలు, కరెన్సీ పేర్లు, ప్రముఖుల పేర్లు చెబుతుంటారు. ఈ పాప మాత్రం కేవలం మూడు నిమిషాల 37 సెకన్లలో ఏకంగా 41 హిందూ దేవతామూర్తుల పేర్లు టకటకా చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. కరీంనగర్‌కు చెందిన గజవాడ స్ఫూర్తి, ప్రభుల కూతురు ప్రదాత్రి గతేడాది ఆగస్టు 16న ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించింది. అప్పుడు ఆమె వయసు రెండేళ్ల 5 నెలల 26 రోజులు.

ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు..

కూతురిలో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు స్ఫూర్తి, ప్రభు గుర్తించారు. లేలేత ప్రాయంలో 9 నెలల్లో మాటలు పలకగా దేవతల చిత్రాలు చూపించి ప్రోత్సహించారు. చిన్నారికి గోరుముద్దలు తినిపిస్తూ భగవంతుల బొమ్మలు చూపిస్తుండేవారు. శుక్లాం బరధరం చదివినప్పుడు వినాయకుడి చిత్రం చూసి పేరు చెప్పడంతో ఆమెలో ప్రతిభను గుర్తించారు. సాధారణంగా 22 హిందూ దేవాలయాల్లో దేవతామూర్తులు చాలామందికి తెలుసు. కానీ  కొందరికి తెలియని అంజనాదేవి, వాయుదేవుడు, దశరథమహరాజు, సుమిత్ర, కౌసల్య, కైకేయి, తదితరుల పేర్లు చిన్నారి గుర్తు పెట్టుకోవడం విశేషం. ‘శుక్లాం బరధరం, సరస్వతి నమస్తుభ్యం, అయిగిరినందిని, అన్నమయ్య’ శ్లోకాలు చెబుతోంది. రోజూ రాత్రి నిద్రించే సమయంలో హన్‌మాన్‌ చాలీసా వింటుంది. ఆమెలో ప్రతిభ రికార్డు చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులకు పంపించారు. పాప ప్రతిభను బుక్‌లో భద్రపరచి పురస్కారం, ధ్రువీకరణపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని