logo

ఆధ్యాత్మిక శోభ

ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఒక పక్క శ్రీరామ నవమి వసంతోత్సవాలు మొదలుకాగా.. మరో పక్క శుక్రవారం నుంచి రంజాన్‌ మాస ఉపవాస దీక్షలు ఆరంభమవుతున్నాయి.

Published : 24 Mar 2023 04:14 IST

మొదలైన శ్రీరామ నవమి వసంతోత్సవాలు
నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ఆరంభం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఒక పక్క శ్రీరామ నవమి వసంతోత్సవాలు మొదలుకాగా.. మరో పక్క శుక్రవారం నుంచి రంజాన్‌ మాస ఉపవాస దీక్షలు ఆరంభమవుతున్నాయి. ఏ ఆలయం చూసినా.. ఏ మసీదు చూసినా భక్తజనంతో నిండిపోనున్నాయి. మార్కెట్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలు కళకళలాడనున్నాయి.

ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా రంజాన్‌ను చూస్తారు. ఈ నెలంతా ఉపవాసాలు పాటించడం ప్రతి ఒకరి విధిగా భావిస్తారు. ఈ ఉపవాస దీక్షలు వారిలో దైవభీతి నెలకొల్పి సత్కార్యాలు ఆచరించేలా.. చెడు కార్యాలకు దూరంగా ఉండేలా చేస్తాయి. గురువారం రాత్రి నెలవంక దర్శనంతో సైరన్‌ మోగడంతోనే మరుసటి రోజు శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. దైవానికి కృతజ్ఞత తెలియజేసేందుకు ఈ ఉపవాస దీక్షలు కఠినంగా చేస్తారు. ఇస్లాం సౌధానికి ఉండే అయిదు మూల స్తంభాల్లో రంజాన్‌ ఉపవాస వ్రతం ఒకటి. పవిత్ర గ్రంథం ఖురాన్‌ అవతరించిన మాసం కావడంతో ఆధ్యాత్మిక సౌఖ్యానికి సంబంధించిన దివ్య బోధనలు వినడం.. చదవడం.. ఆచరించడం చేస్తారు. ఈ మాసంలో సాధారణ, తరావీహ్‌ ప్రత్యేక నమాజ్‌లు చేయాల్సి ఉంటుంది.

మసీదుల్లో పారిశుద్ధ్య పనులు..

రంజాన్‌ మాసం సందర్భంగా మసీదుల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. నిరంతరం నీటి సరఫరాతోపాటు కరెంటుకు అంతరాయం లేకుండా చూడాలని, మసీదు, ఈద్గా స్థలాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్‌, పంచాయతీ అధికారులు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 650 మసీదులు ఉన్నాయి. కరీంనగర్‌ నగరంతోపాటు శివారులోనే దాదాపు 80 ఉన్నాయి. వేసవికాలం కావడంతో తాగునీటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. రంజాన్‌ సందర్భంగా ఇప్పటికే హలీమ్‌ స్టాళ్లు వెలిశాయి. కరీంనగర్‌లో పండ్ల మార్కెట్‌ కళకళలాడుతుంది.

నవరాత్రోత్సవాలు

శ్రీరామ నవమి నవరాత్రోత్సవాలనే వసంతోత్సవాలుగా ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రామాలయాలు, హనుమాన్‌ దేవాలయాతోపాటు వైష్ణవ, శివాలయాల్లో కూడ శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు శ్రీసీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తి గీతాల ఆలాపన, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు.


మానవాళికి మార్గదర్శనం చూపే మాసం

దివ్య ఖురాన్‌ అవతరించిన మాసంగా రంజాన్‌ను చూస్తాం. ఖురాన్‌ సర్వ మానవాళికి మార్గదర్శనం చూపించే గ్రంథం. నెల రోజుల ఉపవాస దీక్షలు సన్మార్గంలో జీవించే విధానాన్ని అలవర్చుకునేలా చేస్తాయి. పేదలపై సానుభూతి చూపించడమే కాకుండా, అందరూ పండగ సమానంగా చేసుకోవాలనే ఫిత్రా దానాలు చేస్తారు. ఇది మానవుడిలో పరివర్తన తీసుకొచ్చే మాసం.

మహమ్మద్‌ ఖైరొద్దీన్‌, అధ్యక్షుడు, జమాతే ఇస్లామీ హింద్‌, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని