logo

సమస్యలకు మోక్షం కల్పించరూ!

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను ఏకరవు పెట్టారు.

Updated : 28 Mar 2023 06:32 IST

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టిపెట్టాలి

వినతులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ తదితరులు

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. కింది స్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని వేడుకొన్నారు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 28 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. రెవెన్యూకు సంబంధించి 14, సిరిసిల్ల మున్సిపాలిటీ-4, డీఎంహెచ్‌ఓ, డీపీవో, డీఆర్‌డీవోలకు సంబంధించి రెండేసి చొప్పున, సబ్‌ రిజిస్ట్రార్‌, విద్యాశాఖ, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో, తంగళ్లపల్లి ఎంపీడీవోలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి.


న్యాయం చేయాలి
- మంజుల, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

మా గ్రామం రుద్రవరం. మధ్యమానేరులో ముంపునకు గురైంది. నేను ప్రభుత్వ పునరావాస ప్యాకేజీకి అర్హురాలిని. రుద్రవరం గ్రామానికి చెందిన గాలిపెల్లి స్వామి అనే వ్యక్తి నీకు పట్టా రాదు, నేను పైరవీ చేసి పట్టా ఇప్పిస్తానని నా వద్ద రూ.40 వేలు తీసుకున్నాడు. నాకు శాభాష్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో సర్వే నంబర్‌ 451లో 339 ప్లాట్ నంబర్‌ పట్టా వచ్చింది. అయినప్పటికీ గాలిపెల్లి స్వామి నాకు శ్మశానవాటికలో పట్టా వచ్చిందని మోసం చేశాడు. తాను పైరవీ చేయడం వల్లే వచ్చిందని, రూ.16 లక్షలు ఇచ్చి ప్లాట్ తీసుకుంటానని బెదిరించాడు. రూ.లక్ష నా ఖాతాకు పంపి, మిగతా డబ్బులు తరవాత ఇస్తానన్నాడు. నాతో తెల్ల కాగితంపై సంతకం చేయించుకొని ప్లాట్ను తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి.


రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై..
- ఎగుర్ల బీరయ్య, కందికట్కూర్‌, ఇల్లంతకుంట మండలం

నాకు కందికట్కూర్‌ శివారులో సర్వే నంబరు 150లో 12 గుంటలు, సర్వే నంబర్‌ 435లో 7 గుంటల భూమి, సర్వే నంబర్‌ 275లో 2 గుంటల భూమి ఉంది. నేను 55 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నా. నేను నిరక్షరాస్యుడనని ఎగుర్ల లింగమ్మ, ఎగుర్ల రాజమల్లవ్వ, ఎగుర్ల మీనయ్యలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి పేర్లపై మార్చుకున్నారు. ప్రశ్నిస్తే నాపై దాడి చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. నా న్యాయం చేయాలి.


ఇంటి పన్ను ఎక్కువ విధించారు
- వేముల పోశెట్టి, సిరిసిల్ల

మున్సిపల్‌ పరిధిలో ఉంటాను. మాకు ఇంటి పన్ను ఎక్కువగా విధించారు. మాకు దుకాణం లేకపోయినా ఉన్నట్లుగా పరిగణంచి ఎక్కువ పన్ను వేశారు. ప్రశ్నిస్తే తప్పనిసరిగా కట్టాలని చెబుతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.  అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.


తీగలకుంట చెరువు పరిధి మార్చాలి
- పిట్టల లాస్య, సర్పంచి, రాధ, జ్యోతి, పద్మ, రేవతి కొత్తపేట గ్రామస్థులు

చందుర్తి మండలంలోని కొత్తపేటకు, జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలానికి మధ్య ఉన్న తీగలకుంట చెరువు ప్రస్తుతం జగిత్యాల జిల్లా నీటిపారుదలశాఖ పరిధిలో ఉంది. దీంతో కొత్తపేట గ్రామస్థులకు చెరువులో సాగు నీటి హక్కులు లేవు. ప్రభుత్వం స్పందించి తీగలకుంట చెరువును రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదలశాఖ పరిధిలోకి మార్చాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని