logo

భూసేకరణలో జాప్యం

భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు

Published : 28 Mar 2024 05:39 IST

జాతీయ రహదారుల విస్తరణలో ఇబ్బందులు

న్యూస్‌టుడే, జగిత్యాల: భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు. నిజామాబాద్‌-జగదల్‌పూర్‌ జాతీయ రహదారి జిల్లాలో మెట్‌పల్లి నుంచి రాయపట్నం వరకు ఉంది. రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నాలుగైదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతుండగా.. నిధులు మంజూరైనప్పటికీ భూసేకరణకు అడ్డంకులు ఏర్పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండు జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా ఇప్పటికే అధికారులతో సమీక్ష జరిపి దిశానిర్దేశం చేశారు. ఇబ్బందులున్న గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  

 జగిత్యాల-కరీంనగర్‌: జగిత్యాల-కరీంనగర్‌ మీదుగా వరంగల్‌ వరకు జాతీయ రహదారిగా మార్చేందుకు ఆరేళ్ల కిందట నిధులు మంజూరయ్యాయి. నాలుగేళ్ల కిందట భూసేకరణ విషయమై అభ్యంతరాలు రావటంతో అర్ధంతరంగా నిలిచిపోగా ప్రస్తుతం కరీంనగర్‌-వరంగల్‌ మధ్య రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా జగిత్యాల-కరీంనగర్‌ మధ్య పనులకు మోక్షం కలగపోవడంతో నిధులు వెనక్కివెళ్లాయి. గతంలో రహదారికి ఒకేవైపు భూసేకరణ జరపాలని నిర్ణయించడంతో భూనిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా 18 కి.మీ మేరకు మిషన్‌ భగీరథ పైపులైన్లు పోతుండటంతో నిలిపివేశారు. దీనికి బదులు జగిత్యాల-పెగడపల్లి-చొప్పదండి మీదుగా మానకొండూర్‌ చేరుకునే విధంగా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ప్రతిపాదించి సర్వే జరిపినప్పటికి పెద్దగా ఉపయోగం ఉండదని భావించి నిలిపివేశారు. ప్రస్తుతం పాత రహదారికిరువైపులా విస్తరణకు ప్రతిపాదించటంతో భూసేకరణ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో చల్‌గల్‌ బైపాస్‌ రహదారి నుంచి రాజారం మీదుగా నమిలికొండ వరకు 130 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. మరో మూడునెలల్లో భూసేకరణ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ రహదారి విస్తరణ పనులను వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదించనుంటంతో పనులు ఆలస్యమయ్యే అవకాశముందని భావిస్తున్నారు.  

 


వేగం పెంచుతాం
-  పి.మధుసూదన్‌, జగిత్యాల ఆర్డీవో

జిల్లాలో జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణలో వేగం పెంచుతాం. జగిత్యాల డివిజన్‌లో చల్‌గల్‌ నుంచి రాయపట్నం వరకు అవసరమైన భూసేకరణ కోసం సర్వే పూర్తయింది. ఆరునెలల్లో ప్రక్రియ పూర్తవుతుంది. జగిత్యాల-కరీంనగర్‌ రహదారిలో అవసరమైన భూసేకరణ పూర్తికావస్తోంది. మరోమూడు నెలల్లో సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది.


నిజామాబాద్‌-జగదల్‌పూర్‌

నిజామాబాద్‌-జగదల్‌పూర్‌ మధ్య గతంలోనే జాతీయ రహదారి నిర్మాణం జరగ్గా నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నిధులు కేటాయించినా అవసరమైన భూసేకరణ ఆలస్యం కావటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో మెట్‌పల్లి నుంచి రాయపట్నం వరకు 224 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. రహదారికిరువైపులా విస్తరించాలని మొదట ప్రతిపాదించగా మార్గమధ్యలో ఉన్న పట్టణ, గ్రామాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో పట్టణాలు, మండల కేంద్రాల్లో బైపాస్‌ రహదారులు నిర్మించటంతోపాటు జగిత్యాల జిల్లా కేంద్రం తగలకుండా చల్‌గల్‌ నుంచి పొలాస శివారుకు చేరే విధంగా బైపాస్‌ రహదారి ప్రతిపాదించారు. అక్కడి నుంచి ధర్మపురి పట్టణానికి సంబంధం లేకుండా బుగ్గారం మండలం మీదుగా నేరుగా రాయపట్నం వెళ్లే విధంగా రహదారి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో సుమారు 69 కి.మీ మేర నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. భూసేకరణ జరిగితే వెంటనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని