logo

బయో మైనింగ్‌ ప్రక్రియకు అవాంతరాలు

పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్‌గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Published : 29 Mar 2024 04:52 IST

రాఘవాపూర్‌లో నిర్మాణం.. రామగుండం, మంథని, సుల్తానాబాద్‌లలో స్థలం కొరత
ఈనాడు, పెద్దపల్లి

పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్‌గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో కీలకమైన బయోమైనింగ్‌ విధానం అమలుకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. కొండల్లా పేరుకుపోతున్న టన్నుల కొద్ది చెత్తను ప్రాసెస్‌ చేసి ఘన వ్యర్థాల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ మార్గదర్శకాల మేరకు ఘన వ్యర్థాలను నిర్వహించేలా బయోమైనింగ్‌ ప్రక్రియను అనుసరించనున్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్‌లో 5 ఎకరాల స్థలంలో దాదాపు రూ.3.5 కోట్లతో బయోమైనింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ యూనిట్‌ నిర్మాణ ప్రక్రియ యంత్రాల బిగింపు పూర్తయినా ప్రాసెసింగ్‌ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ విషయమై పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ.. యంత్రాల బిగింపు పూర్తయిందని, ప్రాసెసింగ్‌ ప్రారంభించాలని గుత్తేదారులకు సూచించామన్నారు. త్వరలో ఉన్నతాధికారుల సాయంతో బయోమైనింగ్‌ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సేంద్రియ ఎరువుతో భూసారం..

పెద్దపల్లిలో రైతులు ఏటా 25 వేల మెట్రిక్‌ టన్నుల పరిమాణంలో యూరియా, ఇతరత్రా ఎరువులు ఉపయోగిస్తున్నారు. విపరీతమైన యూరియా, డీఏపీ ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. బయోమైనింగ్‌ ద్వారా ఉత్పత్తి చేసిన ఎరువులను పొలాల్లో చల్లడం వల్ల భూసారం పెరుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల ఎరువులను స్టీల్‌, ఇతరత్రా పరిశ్రమల్లో బొగ్గుకు బదులుగా ఇంధనంగా వాడేందుకు ఈ పద్ధతి ఉపయోగపడనుంది. చేపల చెరువుల్లోని అడుగులో అమ్మోనియా గాఢతను స్థిరీకరించి జలచరాల మనుగడకు భరోసా కల్పించేందుకు ఈ ఎరువును భవిష్యత్తులో ఉపయోగించనున్నారు.


రోజుకు 30 టన్నుల వ్యర్థాలు

జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు 30 టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. నియోజకవర్గానికి ఒక యూనిట్‌ చొప్పున జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తుండగా కేవలం పెద్దపల్లిలోని రాఘవపూర్‌లో 5 ఎకరాల స్థలం లభించింది. రామగుండం, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో లభించడం లేదు. మంథనిలోని రచ్చపల్లి ప్రాంతంలో సింగరేణి సంస్థ బయోమైనింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు అంగీకరించారు. పెద్దపల్లి మినహా ప్రత్యేకంగా రామగుండం నగరపాలక, మంథని, సుల్తానాబాద్‌ పురపాలికల్లో బయోమైనింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయలేదు. బయోమైనింగ్‌ యూనిట్‌తో పేరుకుపోయిన ఘన వ్యర్థాలను శుద్ధి చేయడంతో పాటు కొత్తగా రోజూ ఉత్పన్నమయ్యే వ్యర్థాలను ప్రాసెస్‌ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. వ్యర్థాలను నిర్దేశించిన ప్రమాణాల మేరకు రీసైక్లింగ్‌ చేస్తారు. ఈ యూనిట్లలో ఉక్కు, ఇతరత్రా పరిశ్రమల్లో బొగ్గుకు బదులుగా పనికొచ్చే ప్లాస్టిక్‌ వ్యర్థాల ఎరువులు ఉపయోగించనున్నారు. ఇందౌర్‌, ముంబయి, విశాఖ నగరాల తరహాలో ఈ-బయోమైనింగ్‌ సాంకేతికతను వినియోగిస్తున్నారు. తడి, పొడి చెత్తను సేకరించి 8 గ్రేడులుగా విభజించి సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని