logo

ఆదాయంలో జమ్మికుంట మార్కెట్‌ టాప్‌

పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్‌పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌ మినహా కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి.

Published : 18 Apr 2024 04:26 IST

2023-24 లక్ష్యాన్ని అధిగమించని జగిత్యాల జిల్లా

జమ్మికుంట మార్కెట్‌లో పత్తి బిడ్డింగ్‌

న్యూస్‌టుడే, జమ్మికుంట: పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్‌పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌ మినహా కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. 2023-2024 సంవత్సరానికి నాలుగు జిల్లాల్లోని మార్కెట్ల ఆదాయం రూ.86.94 కోట్లు సాధించేందుకు మార్కెటింగ్‌ శాఖ లక్ష్యాన్ని నిర్ణయించగా.. నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి రూ.96.21 కోట్ల ఆదాయం సాధించాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే జమ్మికుంట మార్కెట్‌కు ఆదాయం అధికంగా రావటం విశేషం.

రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలు భేష్‌

మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన రూ.14.12 నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని అధిగమించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.19.22 కోట్లు (136 శాతం) ఆదాయం వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన రూ.18.38 లక్ష్యాన్ని అధిగమించి రూ.19.67 ఆదాయాన్ని సాధించింది. జగిత్యాల జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ నిర్ణీత లక్ష్యానికి చేరువలో 98 శాతం సాధించగా రూ.25.54 కోట్లు ఆదాయం లభించింది. ధాన్యానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల పాత బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జమ కావటంతో జగిత్యాల జిల్లా నిర్ణీత లక్ష్యానికి చేరువకు చేరిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు అంటున్నారు. రాజన్న సిరిసిల్లలోని 10 వ్యవసాయ మార్కెట్లలో వేములవాడ మార్కెట్‌ ఆదాయం రూ.5.40 కోట్ల (170 శాతం) లక్ష్యానికి చేరింది. సిరిసిల్ల, పోత్‌గల్‌, రుద్రంగి, ఇల్లంతకుంట, బోయినిపల్లి మార్కెట్ల నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. గంభీరావుపేట నిర్ణీత లక్ష్యానికి చేరువలో 97 శాతం, బొప్పాపూర్‌ మార్కెట్‌ 88 శాతం ఆదాయానికి చేరింది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి మార్కెట్‌ ఆదాయం మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన లక్ష్యానికి చేరువలో రూ.4.77 కోట్లు (99 శాతం) ఆదాయం లభించింది. సుల్తానాబాద్‌ మార్కెట్‌ 85 శాతం, కమాన్‌పూర్‌ మార్కెట్‌ 78 శాతం ఆదాయం లభించింది. మంథని మార్కెట్‌ నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి రూ.3.02 కోట్ల ఆదాయం (193 శాతం) సాధించడం విశేషం. ధర్మారం, జూలపల్లి, శ్రీరాంపూర్‌, రామగుండం మార్కెట్లు లక్ష్యాన్ని అధిగమించాయి. జగిత్యాల జిల్లాలోని 13 మార్కెట్లలో మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, మల్యాల, మేడిపల్లి, వెల్గటూరు మార్కెట్లకు నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం లభించింది. వెల్గటూరు మార్కెట్‌కు రూ.2.24 కోట్లు ఆదాయం (131 శాతం) లభించింది. జగిత్యాల మార్కెట్‌కు రూ.3.65 కోట్లు (79 శాతం) లభించగా, గొల్లపల్లి, కథలాపూర్‌, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, రాయికల్‌ మార్కెట్లలో నిర్ణీత ఆదాయం లక్ష్యాన్ని అధిగమించలేదు.

మద్దతు ధర పెరగటంతోనే..

జమ్మికుంట మార్కెట్‌కు ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ల కంటే అధిక ఆదాయం లభించింది. పంటల మద్దతు ధర పెరగటం, గతేడాదికి సంబంధించిన ప్రభుత్వ సంస్థల పాత బకాయిలు జమకావటం, పత్తి విక్రయాలతోనూ జమ్మికుంట మార్కెట్‌ ఆదాయం పెరిగింది. ఇతర మార్కెట్ల కంటే పత్తికి అధిక ధర ఉండటంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల రైతులు ఇక్కడే పత్తిని విక్రయించారు.

జి.రెడ్డినాయక్‌, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్‌, జమ్మికుంట

లక్ష్యం రూ.86.94 కోట్లు.. సాధించింది రూ.96.21 కోట్లు

కరీంనగర్‌ జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లలో రూ.28.50 కోట్ల ఆదాయాన్ని సాధించేందుకు మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించగా.. రూ.31.77 కోట్లు ఆదాయం సాధించింది. ఉమ్మడి జిల్లాలోని జమ్మికుంట ప్రధాన వ్యవసాయ మార్కెట్‌లో మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన రూ.7.64 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.9.78 కోట్లు ఆదాయం (128 శాతం) లభించటం విశేషం. కరీంనగర్‌ మార్కెట్‌ ఆదాయం రూ.5.77 కోట్లతో 104 శాతం సమకూరింది. హుజూరాబాద్‌ మార్కెట్‌ 6.58 కోట్లు (163 శాతం), మానకొండూరు మార్కెట్‌ రూ.3.21 కోట్లు (152 శాతం) ఆదాయం లభించింది. చొప్పదండి మార్కెట్‌ రూ.2.24 కోట్లు (76 శాతం), గంగాధర మార్కెట్‌ రూ.1.31 కోట్లు (58 శాతం), గోపాల్‌రావుపేట మార్కెట్‌ రూ.1.84 కోట్లు (70 శాతం) సైదాపూర్‌ మార్కెట్‌ రూ.కోటి ఆదాయం (80 శాతం) సమకూరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు