logo

ఎన్నికల పరిశీలకులొస్తున్నారు

లోక్‌సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది.

Published : 18 Apr 2024 04:34 IST

అక్రమాల నియంత్రణకు రంగంలోకి సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు
నేడు నియోజకవర్గాలకు రాక.. నామపత్రాల పరిశీలన

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను నియోజకవర్గాలకు సాధారణ, వ్యయ పరిశీలకులుగా నియమించింది. నామపత్రాల స్వీకరణ మొదలు నుంచి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు మూడు పర్యాయాలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. గురువారం నియోజకవర్గాల్లోని నామపత్రాల స్వీకరణ ప్రక్రియ పరిశీలించనున్నారు.

ప్రచార సరళిపై నిఘా

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే వ్యూహం రచిస్తున్నారు. ప్రచారాల ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నగదు, మద్యం ఇతర తాయిలాల ఆశ చూపెడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నారు. నిర్దేశించిన వ్యయం కంటే రెట్టింపుగా ఖర్చు చేయడంలో వెనుకాడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రచార సరళిపై నిఘా పెంచి, అక్రమాలను కట్టడి చేసేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ వారిని సాధారణ, ఐఆర్‌ఎస్‌, ఐడీఏఎస్‌ సర్వీసు అధికారులు వ్యయ పరిశీలకులుగా రంగంలోకి దిగనున్నారు. నిఘా బృందాలు చిత్రీకరించిన ప్రచారాలు, అభ్యర్థుల ఖర్చులను వీక్షించనున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.

మూడు విడతలుగా పర్యటన

లోక్‌సభ పరిధిలో మూడు విడతలుగా అధికారులు పర్యటించనున్నారు. నామపత్రాల దాఖలు చివరి వరకు, ఉపసంహరణ తర్వాత నుంచి లెక్కింపు వరకు ఇక్కడే మకాం వేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన 27 రోజుల తర్వాత మరోసారి ఇలా మూడు విడతలుగా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థుల ప్రచార సరళి, వ్యయంపై అధికారికంగా రూపొందించిన దస్త్రాలు, ఇతర ఆధారాలను నిశితంగా పరిశీలిస్తారు. వీడియో చిత్రీకరణ, దస్త్రాల్లో వ్యత్యాసం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆయా అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. గురువారం జిల్లాలకు రానుండటంతో అతిథి గృహాలను కేటాయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు