logo

ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు

రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్‌-2.0, యు.ఐ.డి.ఎఫ్‌.(అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) నిధులతో పరిష్కారం కానున్నాయి.

Published : 23 Apr 2024 02:08 IST

గోదావరిఖని కల్యాణ్‌నగర్‌లోని మురుగు కాలువ

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్‌-2.0, యు.ఐ.డి.ఎఫ్‌.(అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) నిధులతో పరిష్కారం కానున్నాయి. గోదావరి నదీ జలాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు మూడు దశాబ్దాల క్రితం రామగుండంలో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ గాడి తప్పడంతో పారిశ్రామిక ప్రాంతంలోని మురుగు జలాలు నేరుగా గోదావరినదిలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మురుగు జలాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి, హరిత ట్రిబ్యునల్‌ పలుమార్లు నగరపాలికకు నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వంలో చలనం మొదలైంది. మురుగు జలాల శుద్ధి కోసం అనేకసార్లు అంచనాలు సిద్ధం చేసినప్పటికీ నిధుల కొరతతో పాటు వివిధ కారణాలతో ఆచరణకు నోచుకోలేదు. తాజాగా ‘అమృత్‌-2.0’లో రామగుండంలో ప్రధాన మురుగు కాలువలు, మురుగు జలాల శుద్ధి కేంద్రాల నిర్వహణకు రూ.252.82 కోట్లు మంజూరు చేయడంతో త్వరలోనే మురుగు సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. మురుగు జలాల శుద్ధి కేంద్రాల నిర్వహణకు అవసరమైన స్థల సేకరణకు మరో రూ.3 కోట్లు కేటాయించారు.

రామగుండం నగరపాలక ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం యు.ఐ.డి.ఎఫ్‌. నుంచి రూ.88.9 కోట్లు ప్రకటించారు. ఇందులో 85 శాతం నిధులను నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు ద్వారా రుణసాయం అందించనుండగా మిగతా 15 శాతం నిధులను నగరపాలిక సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు రుణం అందించాక రెండేళ్ల పాటు మారటోరియం విధించనుండగా ఆ తర్వాత అయిదేళ్లలో అయిదు సమాన వాయిదాల్లో రుణసాయాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ‘అమృత్‌’ నిధులతో రామగుండం కార్పొరేషన్‌లోని భీమునిపట్నం, సీఎస్పీ కాలనీ, విఠల్‌నగర్‌లో మూడు ట్యాంకులతో పాటు 16 కిలోమీటర్లు నీటి సరఫరా ప్రధాన పైపులైన్లు, 150 కిలోమీటర్లు ఇంటింటా నీటి సరఫరా కోసం డిస్ట్రిబ్యూషన్‌ పైపులైన్లు నిర్మించడంతో పాటు 20 వేలకు పైగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. రామగుండంలో మొత్తం 13 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా కొనసాగుతున్నప్పటికీ వివిధ కారణాలతో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న ఇక్కట్లు తీర్చడంతో పాటు నీటి సరఫరా తీరును మరింత మెరుగు పరుస్తూ ప్రజలకు నిరంతరంగా నీటిని సరఫరా చేసేందుకు యు.ఐ.డి.ఎఫ్‌. నిధులు ఉపయోగపడే అవకాశముంది.

అమృత్‌-2.0 కేటాయింపులు (రూ. కోట్లలో)

కేంద్ర ప్రభుత్వం 68.88
రాష్ట్ర ప్రభుత్వం 118.43
15వ ఆర్థిక సంఘం 19.35
నగరపాలిక 46.16
తాగునీటి సరఫరాకు 88.9

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని