logo

పార్టీ అధికారంలోకి వస్తే.. పథకాలు నేరుగా మహిళలకే..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు నేరుగా స్త్రీలకు అందించే ఆలోచన చేస్తున్నాం. మహిళలకు నేరుగా పథకాలు అందితే ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుందని కె.పి.సి.సి. అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పేర్కొన్నారు.

Published : 25 Jun 2022 00:55 IST

బళ్లారి ‘నా నాయకి’ కార్యక్రమంలో డీకే శివకుమార్‌

పూర్ణకుంభాలను తీసుకుని వస్తున్న మాజీ మంత్రి ఉమాశ్రీతో పాటు మహిళ కాంగ్రెస్‌ సభ్యులు

బళ్లారి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు నేరుగా స్త్రీలకు అందించే ఆలోచన చేస్తున్నాం. మహిళలకు నేరుగా పథకాలు అందితే ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుందని కె.పి.సి.సి. అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ స్త్రీ శక్తి సంఘటన సమితి ఆధ్వర్యంలో స్థానిక సంగనకల్లు రహదారిలోని కె.ఆర్‌.ఎస్‌. కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ‘నా నాయకి’ కార్యక్రమాన్ని డి.కె.శివకుమార్‌ వర్చువల్‌ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కలలు నిజం చేయడానికి మహిళలు సబలీకరణ కావాలి. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ఇందిరాగాంధీ కలలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. సమాజంలో తల్లికి విశిష్ట స్థానం ఉంది. తల్లిని మించిన దైవం లేదు. అంత పవిత్రమైన స్థానం పొందిన మహిళల అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే  స్థానిక ఎన్నికల్లో మహిళలు గెలుపొందినా అధికారం మాత్రం భర్తలు, ఇంట్లో పురుషులు, తదితర కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారు. స్త్రీలకు కూడా పరిపాలన చేసే శక్తి ఉంది. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి శ్రమించాలని డీకే కోరారు. బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పోటీ చేసినప్పుడు ఈ క్షేత్రం ప్రజలు ఆశీర్వదించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ‘నా నాయకి’ కార్యక్రయం కూడా మొదటిసారిగా బళ్లారిలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘నా నాయకి’ కార్యక్రమానికి  అధ్యక్ష వహించిన, మాజీ మంత్రి ఉమాశ్రీ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద శక్తి ఉంది. మహిళలు కూడా వెంట నిలిచారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో పాటు, నిత్యావసర వస్తువులు ధరలు పెరగడంతో మహిళలు ఇబ్బందులు పడే వాతావరణం సృష్టించారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. మహిళలను ఏకతాటిపైకి తేవడానికి కాంగ్రెస్‌ పార్టీ‘ నా నాయకి’ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తమ సమస్యలు, తదితర వాటిని నేరుగా చర్చించే అవకాశం కల్పించాం. పార్టీ అభివృద్ధికి మీరు ఇచ్చే సలహాలు ఉంటే వాటిని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు మహిళా నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మోటమ్మ కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలను వివరించారు. గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, శాసనసభ్యురాలు మినాశి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పుష్పా అమరనాథ్‌, మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, సభ్యులు కవితారెడ్డి, కమల మరిస్వామి, విశ్రాంత ఉపకులపతి డా.మల్లికాఘంటి, జిల్లా మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మంజుళ, శోభా కళింగ, కుమారమ్మ, పద్మా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముందు ఉమాశ్రీతో పాటు పలువురు పూర్ణకుంభాలతో వేదిక వద్దకు చేరుకున్నారు.

వర్చువల్‌ ద్వారా మాట్లాడుతున్న కె.పి.సి.సి. అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు