logo

నకిలీ స్టాంపులతో ఆస్తుల కబ్జా

ఏకంగా రాజధాని నగరంలోని రెవెన్యూ భవన్‌ ఆవరణలో నకిలీ స్టాంపు కాగితాలను విక్రయిస్తున్న 11 మందిని బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు అరెస్టు చేశారు. విశ్వనాథ్‌, కార్తిక్‌, వెంకటేశ్‌, శ్యామరాజు, శశిధర, కరియప్ప, రవిశంకర్‌

Published : 06 Aug 2022 02:06 IST

నకిలీ స్టాంపు కాగితాలను పరిశీలిస్తున్న అధికారులు రమణ గుప్త, డాక్టర్‌ శరణప్ప తదితరులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఏకంగా రాజధాని నగరంలోని రెవెన్యూ భవన్‌ ఆవరణలో నకిలీ స్టాంపు కాగితాలను విక్రయిస్తున్న 11 మందిని బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు అరెస్టు చేశారు. విశ్వనాథ్‌, కార్తిక్‌, వెంకటేశ్‌, శ్యామరాజు, శశిధర, కరియప్ప, రవిశంకర్‌, శివశంకరప్ప, గుణశేఖర్‌, రాఘవ, కిశోర్‌లను నిందితులుగా గుర్తించామని జాయింటు పోలీసు కమిషనర్‌ రమణగుప్త శుక్రవారం ప్రకటించారు. వీరి నుంచి రూ.5.11 లక్షల ముఖ విలువ కలిగిన 2664 నకిలీ స్టాంపు కాగితాలు, కంప్యూటర్‌, టైపు రైటర్‌, ప్రింటర్‌, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల పేరిట తయారు చేయించిన 119 నకిలీ సీళ్లు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనపరుచుకున్నారు. ఒక్కో స్టాంపు కాగితాన్ని రూ.5 వేలకు విక్రయించినా, వీటి విలువ రూ.1.33 కోట్లు ఉంటుందని చెప్పారు. వీరు తొమ్మిదో దశకంలోని స్టాంపు కాగితాలను తయారు చేసి, వాటిపై నకిలీ ఒప్పంద పత్రాలు తయారు చేసి, ఆస్తుల కబ్జాకు ప్రయత్నాలు చేశారని గుర్తించారు. పాత స్టాంపు కాగితాలను రూ.5-8 వేలకు వీరు విక్రయించేవారు. ఆస్తి వివాదాలు ఉన్న వారిని వీరు సంప్రదించి, నకిలీ విల్లు, ఒప్పంద పత్రాలను తయారు చేసే వారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. వీరి నుంచి నకిలీ స్టాంపు కాగితాలను కొనుగోలు చేసుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని డీసీపీ డాక్టర్‌ శరణప్ప తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను హలసూరు గేటు పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని