logo

పాదయాత్ర... జనాకర్షణ మంత్రం!

కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు కర్ణాటకలో జన స్పందన లభిస్తోంది. తమిళనాడు, కేరళలతో పోలిస్తే రాష్ట్రంలో అందుతున్న మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల యాత్రను ముగించారు. పండుగ నేపథ్యంలో రెండు రోజుల విరామం దొరకటంతో పార్టీ శ్రేణులు సరికొత్త ప్రణాళికలను రచించేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 04 Oct 2022 02:18 IST

రాచనగరిలో రాహుల్‌ జోరు!

మైసూరు వీధుల్లో అడుగులు వేస్తున్న రాహుల్‌గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తదితరులు

ఈనాడు, బెంగళూరు : కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు కర్ణాటకలో జన స్పందన లభిస్తోంది. తమిళనాడు, కేరళలతో పోలిస్తే రాష్ట్రంలో అందుతున్న మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల యాత్రను ముగించారు. పండుగ నేపథ్యంలో రెండు రోజుల విరామం దొరకటంతో పార్టీ శ్రేణులు సరికొత్త ప్రణాళికలను రచించేందుకు సిద్ధమవుతున్నారు. చామరాజనగర, మైసూరుల్లో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో తమ సమస్యలు వెల్లడించుకునేందుకు వృద్ధులు, మహిళలు, యువత, విద్యార్థులు కదలివచ్చారు. ఈ యాత్రకు ఏమాత్రం ప్రయాస లేకుండానే జనం పోటెత్తటంతో రాష్ట్ర నేతలు ఉల్లాసంగా కనిపించారు.

శ్రీరంగపట్టణ సమీపాన ఓ బాలికతో ముచ్చట్లు

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలిసారిగా ఈ యాత్రలో పాల్గొనటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అనారోగ్య కారణాలతో ఇప్పటి వరకు ఈ యాత్రలో పాల్గొనలేకపోయిన ఆమె కర్ణాటకలో అడుగు వేసేందుకు సిద్ధకావటంతో రాష్ట్ర నేతలకు కొండంత ధైర్యం వచ్చినట్లైంది. మరో ఆరు నెలల్లో విధానసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సోనియాగాంధీ, కీలక నేతలు రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే ఒకే వేదికపై పాల్గొంటారు. వీరు పాల్గొనే యాత్ర మార్గాల్లో అభిమానుల సందడిని పెంచే ప్రయత్నంలో నేతలు నిమగ్నమయ్యారు. గురువారం యాత్రలో సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, శుక్రవారం మండ్య నుంచి మొదలయ్యే యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని పార్టీ వెల్లడించింది.

*  భారత్‌ ఐక్యతా యాత్రలో పాల్గొనాలని నక్సలైట్లు, మావోయిస్టులు, వారి సానుభూతిపరులను ఆహ్వానించారా? అంటూ భాజపా రాజ్యసభ ఎంపి లెహర్‌ సింగ్‌ ప్రశ్నించి సంచలనానికి తెరలేపారు.

మైసూరులో కళాకారులతో కలిసి తాళం వేస్తూ..


విమర్శల వాన

సిద్ధుపై భాజపా సంధించిన బాణం

కాంగ్రెస్‌ చేస్తున్న యాత్రపై భాజపా సామాజిక మాధ్యమ విభాగం విమర్శలతో పోటెత్తింది. పీఎఫ్‌ఐకు మద్దతిచ్చిన సిద్ధరామయ్య- ఆ సంస్థను రద్దు చేయగానే తొలి రెండు రోజులు యాత్రలో పాల్గొనలేదని ఆరోపించింది. భారత్‌ను విడగొట్టాలని ప్రకటించిన వారు దేశాన్ని ఎలా ఒకటి చేస్తారని భాజపా ప్రశ్నించింది. రాష్ట్రంలో పీఎఫ్‌ఐకు మద్దతివ్వగా- జమ్ము కశ్మీరులో తీవ్రవాదాన్ని పెంచినట్లు ఆరోపించింది. జిహాదీలను ప్రోత్సహించిన సిద్ధరామయ్య గురించి తెలుసుకోవాలంటే ‘పీఎఫ్‌ఐ భాగ్య’కు క్యూ ఆర్‌ కోడ్‌ను స్క్యాన్‌ చేయాలని ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ యాత్రకు పోటీగా ఈనెల 7న బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించేందుకు భాజపా సన్నాహకాలు చేస్తోంది.


అందరిలో ఒకడిగా

ఈ యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని కీలకమైన సమస్యలపై దృష్టి సారించారు. పాత్రికేయులు, కవులు, చరిత్రకారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరితో కలిసి చర్చిస్తున్నారు. వారు ఇచ్చే ఫిర్యాదులు, మనవి పత్రాలను ఎంతో ఓపికగా స్వీకరించారు. భద్రతా సిబ్బంది వారించినా ఏమాత్రం లెక్కచేయకుండా యువకులతో మాట్లాడారు. సోమవారం చాముండేశ్వరి దేవాలయం, సుత్తూరు మఠాన్ని సందర్శించారు. ఆపై సెయింట్‌ ఫిలోమినా చర్చ్‌, మసీదులనూ చుట్టేశారు. శ్రీరంగపట్టణంలో గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యసంస్కారాలు చేసే అయూబ్‌, సామాజికవేత్త మల్లేశ, మహిళా ఆటోడైవర్‌ మంగళ తదితరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మైసూరు, శ్రీరంగపట్టణం, పాండవపుర తదితర ప్రాంతాల్లో ఆయన అక్కడి దసరా ఉత్సవాల ప్రత్యేక కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

వారే.. విభజించారు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : తమ స్వార్థం కోసం దేశాన్ని విభజించిన వ్యక్తులు.. ఇప్పుడు భారత్‌ జోడో యాత్ర చేయడం సిగ్గుచేటని రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ మండిపడ్డారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ తన స్వార్థం కోసం బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌గా దేశాన్ని విభజించారని.. ఆయన కుటుంబ సభ్యుడు రాహుల్‌ ఇప్పుడు భారత్‌ జోడో యాత్ర చేపట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలనలో పీఎఫ్‌ఐపై ఉన్న కేసులను రద్దు చేసి ఇప్పుడు తాను ఎప్పుడో చెప్పాను ఆసంస్థపై నిషేధించాలని ప్రకటించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తీరును తప్పుపట్టారు.
 

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts