logo

చదువులు..చెరిగెను హద్దులు

ఇకపై డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధి ఏ సబ్జెక్టులో చదివావని ప్రశ్నించే వారు కనిపించరేమో! సంప్రదాయ కళాశాలలో చదివినా సాంకేతిక డిగ్రీ విద్యార్ధికి దీటుగా ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు నేటి విద్యార్థులు.

Updated : 25 Nov 2022 04:35 IST

కళాశాలలన్నీ బహుముఖ డిగ్రీ క్లస్టర్లే

తరగతిలోనే ఉపాధికి అవసరమైన నైపుణ్యం

ఈనాడు, బెంగళూరు : ఇకపై డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధి ఏ సబ్జెక్టులో చదివావని ప్రశ్నించే వారు కనిపించరేమో! సంప్రదాయ కళాశాలలో చదివినా సాంకేతిక డిగ్రీ విద్యార్ధికి దీటుగా ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు నేటి విద్యార్థులు. అందుకు కారణంగా ఇకపై విశ్వావిద్యాలయాలు, కళాశాలలు ఒకే ప్రత్యేకతలతో చదువులు చెప్పే ప్రాంగణాలుగా కాకుండా బహముఖ సబ్జెక్టులు (మల్టీ డిసిప్లినరీ) అందించే క్లస్టర్లుగా మారబోతున్నాయి. విశ్వవిద్యాలయాల వేతనం సంఘం (యూజీసీ) ఇప్పటికే వెల్లడించిన ఉన్నత విద్యా సంస్థల మార్గదర్శకాలను కర్ణాటకలోని అత్యధిక కళాశాలలు అందిపుచ్చుకున్నాయి. ఈ కారణంగా ఇకపై విద్యా సంస్థలను మల్టీడిసిప్లినరీ క్లస్టర్లుగా పిలవక తప్పదు.

ఐఐఎస్‌సీతోనే మొదలు..

చారిత్రక భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ)తోనే కర్ణాటకలో బహముఖ విద్యా బోధన మొదలైంది. పేరుకు భారతీయ విజ్ఞాన సంస్థ అయినా.. ఇక్కడ ఇంజినీరింగ్‌లో ప్రపంచ శ్రేణి బోధన ప్రమాణాలు అందిస్తోంది. జీవశాస్త్రం, రసాయన, భూవిజ్ఞాన, గణితం, భౌతిక శాస్త్రాల్లో పీహెచ్‌డీలు అందించిన ఈ సంస్థ ఇదే కోర్సులతో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రీసెర్చ్‌) కార్యక్రమాన్ని ఎనిమిది సెమిస్టర్లుగా బోధిస్తోంది. వీటిల్లో ఇంజినీరింగ్‌, హ్యూమనిటీస్‌లతో ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులను నిర్వహిస్తోంది. ఈ తరహా కోర్సులను తాజా పీయూ, డిగ్రీ (ఫస్ట్‌గ్రేడ్‌), పీజీలు అందించే విశ్వవిద్యాలయాలు (ప్రభుత్వ, ప్రైవేటు) కూడా నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా ప్రారంభించాయి. 2021-22 ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పట్టభద్ర దినోత్సవాల్లో కనీసం 50శాతం మంది విద్యార్థులు మల్టీడిసిప్లినరీ కోర్సుల్లో పట్టాలు పొందటం విశేషం.

2035 నాటికి క్లస్టర్లు..

ఒక విద్యార్ధి పీజీ చేయాలంటే విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయటం ప్రస్తుత ఉన్నత విద్యా విధానంలోని కీలక నిబంధన. ఇకపై ఈ నిబంధన సమూలంగా తొలగిపోనుంది. అందులోనూ భిన్నమైన సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ చేసే వెసులుబాటు కల్పిస్తోంది యూజీసీ ఉన్నత విద్యా సంస్థల విధానం. ఉన్నత విద్యాసంస్థ (హెచ్‌ఈఐ) వచ్చే విద్యా సంవత్సరం నుంచి మల్టీ డిసిప్లినరీ ఇన్‌స్టిట్యూషన్‌(ఎంఐ)గా, టీచింగ్‌ ఇంటెన్సివ్‌ యూనివర్సిటీస్‌ (టీయూ), రీసెర్చ్‌ ఇంటెన్సివ్‌ యూనివర్సిటీ (ఆర్‌యూ)లుగా మారనున్నాయి. కళాశాల.. ఇకపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కళాశాల(అటానమస్‌)గా మారి వేరొక విశ్వవిద్యాలయంతో అనుబంధ కోర్సులు నిర్వహించే క్లస్టరుగా మారుతుంది. ఈ విధానంతో బీఏ పూర్తి చేసిన విద్యార్థి కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేయాలన్నా ఎలాంటి పోటీ పరీక్ష లేకుండా క్లస్టర్‌ వ్యవస్థలో భాగస్వామి అయిన విశ్వవిద్యాలయంలో నేరుగా సీటు పొందవచ్చు. రాష్ట్రంలో 2022-23 ఏడాది ఇలాంటి క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. బెంగళూరు కేంద్రీయ విశ్వవిద్యాలయం(బీయూసీ) నేతృత్వంలో మల్టీడిసిప్లినరీ కాన్‌స్టిట్యూయంట్‌ కాలేజ్‌(ఎంసీసీ)ని మల్లేశ్వరంలో ప్రారంభించారు.  

ఎన్నెన్నో మార్పులు..

నేడు సబ్జెక్టులకు సరిహద్దులు లేవని ఐఐఎస్‌సీ మాజీ డైరెక్టర్‌ ఆచార్య పి.బలరాం అన్నారు. ఆయన ఐకేర్‌ సంస్థ, రామయ్య సాంకేతిక విద్యా సంస్థలు ‘అప్లైడ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ సైన్సెస్‌’ అంశంపై నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఇంజినీరింగ్‌కు అప్లైడ్‌ సైన్స్‌ సంబంధాలు ఎంతో విస్తృతమైనవని అన్నారు. సైన్స్‌ లేకుండా ఇంజినీరింగ్‌ లేదు. నేడు సబ్జెక్టుల మధ్య అడ్డుగోడలు చెరిగిపోయి బహుముఖ నైపుణ్యం ఉన్న మానవ వనరులు దేశానికి శక్తిగా మారాయన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు