logo

అవినీతి పాలనకు అంతిమకాలం

కర్ణాటకలో రాహుల్‌ గాంధీ 510 కిలోమీటర్ల పాదయాత్రను చామరాజనగర జిల్లా గుండ్లుపేట నుంచే ప్రారంభించారని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ గుర్తు చేశారు.

Published : 27 Jan 2023 03:08 IST

భాజపాపై కాంగ్రెస్‌ నిప్పులు

‘ప్రజాధ్వని’ వేదికపై జ్యోతి వెలిగిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్‌

చామరాజనగర, న్యూస్‌టుడే : కర్ణాటకలో రాహుల్‌ గాంధీ 510 కిలోమీటర్ల పాదయాత్రను చామరాజనగర జిల్లా గుండ్లుపేట నుంచే ప్రారంభించారని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదని, వచ్చినా.. ముఖ్యమంత్రి పదవి కోసం నాయకుల మధ్య చీలికలు వస్తున్నాయని అధికార పార్టీ చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. చామరాజనగర జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాహుల్‌ పాదయాత్రకు, దసరా ఉత్సవాలకు హాజరైన సమయంలో కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ వచ్చిన సమయంలో ఈ జిల్లా ప్రజలు చూపించిన ఉత్సాహాన్ని ఎన్నికలలో ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. చామరాజనగరలో ప్రజాధ్వని సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. మేకెదాటు కోసం నిర్వహించిన పాదయాత్రకూ ఇక్కడి ప్రజల నుంచి మద్దతు లభించిందని గుర్తు చేశారు. అవినీతికి పెద్ద పీటవేసే భాజపాను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 17న ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ అబద్ధపు కేటాయింపులే ఉంటాయని, దాన్ని విశ్వసించి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల ధ్వనిని, ఆగ్రహాన్ని, వారికి కావలసిన అంశాలను గుర్తించేందుకు చేస్తున్న ప్రజాధ్వని యాత్రకు చక్కని స్పందన లభిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సాధికారత లభించినట్లేనని తెలిపారు. భాజపాది రహస్య అజెండా అని, శ్రీమంతులు, వ్యాపారులకు మాత్రమే మేలు చేస్తుందని విమర్శించారు. గత ఎన్నికలలో పూర్తి మెజార్టీ రాకపోవడంతో దళ్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, ‘ఆపరేషన్‌ కమల’తో భాజపా ఆ ప్రభుత్వాన్ని కూలదోసిందని ఆరోపించారు. చామరాజనగర ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేక 36 మంది మరణించారని, అప్పుడు కూడా ముగ్గురే చనిపోయారని మంత్రులు అబద్ధం ఆడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాలలోని అర్హులకు చామరాజనగర వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నాయకులు బీకే హరిప్రసాద్‌, ధ్రువనారాయణ, గోవిందరాజు, పుట్టరంగశెట్టి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని