logo

Kumaraswamy: ముఖ్యమంత్రిని టెలిఫోన్‌ ఆపరేటర్‌ చేసేశారు: కుమారస్వామి ఎద్దేవా

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన కుమారుడు డాక్టర్‌ యతీంద్ర టెలిఫోన్‌ ఆపరేటర్‌గా మార్చేశారని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు.

Updated : 20 Nov 2023 09:32 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన కుమారుడు డాక్టర్‌ యతీంద్ర టెలిఫోన్‌ ఆపరేటర్‌గా మార్చేశారని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. సిద్ధరామయ్య, యతీంద్రల సంభాషణలో మాట్లాడుకున్నట్లే ఒక ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేశారని పేర్కొన్నారు. యతీంద్ర సూపర్‌ సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిద్ధరామయ్య వరుణను, యతీంద్రకు మైసూరు జిల్లాను పొరుగుసేవలకు అప్పగించినట్లు ఉందని ట్వీట్‌లో విమర్శించారు. వరుణ ఓటర్లు మిమ్మల్ని గెలిపిస్తే, మీ బదులుగా పనులు చేయాలని యతీంద్రకు అప్పగించారా అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడికి రాజకీయ బాధ్యతలు ఏవీ అప్పగించలేదని స్పష్టం చేశారు. తాను అడిగిన అన్ని ప్రశ్నలకు సీఎం బదులివ్వకుండా, ఇతర అంశాలను మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ తన నియోజకవర్గం బాధ్యతలను తమ కుమారులకు అప్పగించలేదన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీని ‘కరప్ట్‌ సన్‌ ఆఫ్‌ సిద్ధరామయ్య’గా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో జరిగే పనుల్లో 2 శాతం సీఎస్‌ఆర్‌ వాటా తీసుకుంటున్నట్లు ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చే అధికారులకూ బాధ్యతలను యతీంద్రే పంచుతున్నట్లు ఉందన్నారు. మీపై వచ్చిన ఆరోపణలకు బదులివ్వకుండా, తాను విడుదల చేసిన వీడియోను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోపణలు చేసిన వెంటనే మీకన్నా ముందుగా కొందరు మంత్రులు స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతి విషయంలోనూ మీరు చెబుతున్న అబద్ధాలను ప్రజలు గమనిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నాకు మానసిక ఆరోగ్యం బాగానే ఉందని, మీకు అధికారం అనే అంటురోగానికి, ధన దాహానికి ఔషధం, చికిత్సలు లేవని వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని