logo

రణ క్షేత్రం.. రాయచూరు

తెలుగు రాష్ట్రాల సరిహద్దులతో ముడిపడిన రాయచూరు లోక్‌సభ ఎన్నిక రసవత్తర పోరుకు వేదికైంది. భాజపా, కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున పోటీ ఎన్నికల కురుక్షేత్రంగా మారింది.

Published : 16 Apr 2024 01:01 IST

భాజపా- కాంగ్రెస్‌ నువ్వానేనా!

రాయచూరు, న్యూస్‌టుడే : తెలుగు రాష్ట్రాల సరిహద్దులతో ముడిపడిన రాయచూరు లోక్‌సభ ఎన్నిక రసవత్తర పోరుకు వేదికైంది. భాజపా, కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున పోటీ ఎన్నికల కురుక్షేత్రంగా మారింది. సిట్టింగ్‌ ఎంపీ అమరేశ్వర నాయక్‌ (భాజపా), విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.కుమారనాయక్‌ (కాంగ్రెస్‌) మధ్య నువ్వా, నేనా అనే ఉత్కంఠ పోటీ ఏర్పడింది. రాయచూరు కోటపై రెండోసారి కాషాయ పతకాన్ని ఎగుర వేయాలన్న పట్టుదలతో కమలం.. ఒకప్పటి కంచుకోటను కైవశం చేసుకునేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులను కేంద్రీకరించాయి. ప్రజల నాడిని గమనిస్తే ఏ పార్టీకీ గెలుపు సునాయసం కాదు. విజయం కోసం చెమటోడ్చాల్సిందే. కమలం టికెట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎంపీ బి.వి.నాయక్‌ బహిరంగ తిరుగుబాటు రాష్ట్ర భాజపా నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అమరేశ్వరపై నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉండేది.

స్వతంత్ర అభ్యర్థిగా బి.వి.పోటీ చేస్తే పార్టీకి నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తమైంది. నామినేషన్ల సమయానికి అమరేశ్వరను మార్చి అంతిమ అభ్యర్థిగా బీవీనే ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. నష్ట నివారణ చర్యలకు కేంద్ర నాయకత్వం కర్ణాటక ఎన్నికల బాధ్యుడు రాధా మోహన్‌దాస్‌ అగర్వాల్‌ను రంగంలోకి దింపింది. ఆయన రాకతో పరిస్థితులు అమరేశ్వరకు అనుకూలంగా మారిపోయాయి. బి.వి.నాయక్‌ను ఒప్పించడంలో, అమరేశ్వర వ్యతిరేకులను ఒకే తాటిపైకి తెచ్చి ఎన్నికలకు సిద్ధం చేయడంలో అగర్వాల్‌ సఫలీకృతమయ్యారు. కార్యకర్తల సమావేశంలోనే బి.ఫారాన్ని అమరేశ్వరకు అందించడంతో అభ్యర్థి మార్పుపై అనుమానానికి తెరపడింది. ఇన్నాళ్లు దేవాలయాల దర్శనాలు, స్వామీజీలను కలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చిన అమరేశ్వర ప్రజా క్షేత్రంలో ప్రచారానికి అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ఎంపీగా సాధనలు, మోదీ గాలి, హిందుత్వ ప్రభావాన్ని నమ్ముకున్నారు. ఆయన రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా, చీఫ్‌విప్‌గా పనిచేసిన అనుభవముంది. ప్రజల్లో సానుభూతి కోసం ఇదే చివరి ఎన్నికగా ప్రకటించుకున్నారు. దళపతుల మద్దతు కొండంత బలంగా విశ్వసిస్తున్నారు. ఐదేళ్లు కార్యకర్తలు, నాయకులను పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండటం, గ్యారంటీ పథకాలు విసురుతున్న సవాళ్లను ఏలా అధిగమిస్తారో.

కాంగ్రెస్‌ అభ్యర్థి కుమారనాయక్‌ నామినేషన్‌ వేయకముందే మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో ఒక రౌండు ప్రచారాన్ని ముగించారు. మంత్రి బోసురాజు సాయంతో గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాయచూరు సీటు కాంగ్రెస్‌ వశం కావాల్సిందేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ జిల్లా నాయకులకు స్పష్టం చేశారు. దీంతో బోసురాజు, ఆయన వ్యతిరేక వర్గంలోని నాయకులు విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా శ్రమిస్తున్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కుమార గతంలో జిల్లా పాలనాధికారిగా పనిచేశారు. నియెజకవర్గం సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. జిల్లా బాధ్య కార్యదర్శిగా, కేపీటీసీఎల్‌ ఎండీగా జిల్లాలో పర్యటించడంతో ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. వెనుకబడిన రాయచూరు పురోగతికి విద్యావంతుడైన కుమారను ఎన్నుకోవాలని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రాయచూరు, రాయచూరు గ్రామీణ, మాన్వి, దేవదుర్గ, లింగసూగూరు, యాదగిరి జిల్లాలోని యాదగరి, షాపూరు, సురపుర నియోజకవర్గాల్లోని మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్‌ గంపెడాశలు పెట్టుకొంది. ప్రత్యర్థి పార్టీ భజపా నేతలు మాత్రం- కుమారనాయక్‌ స్థానికేతరుడన్న అంశాన్ని ఎత్తి చూపుతున్నారు. ఆయన గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని, చిన్న సమస్యకైనా బెంగళూరుకు వెళ్లాలని ప్రచారం చేస్తోంది. అధికారులకు సామాన్యుల ఇబ్బందులు అర్ధం కావన్న వాదనను తెరమీదకు తెచ్చారు. రాయచూరు, యరమరాస్‌ థర్మల్‌ కేంద్రాలకు భూమిని స్వాధీనం చేసిన రైతులకు కేపీటీసీఎల్‌ ఎండీగా పరిహారాన్ని, ఉద్యోగాలను ఇప్పించడంలో న్యాయం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో ఇది నష్టం చేస్తుందన్న ఒకింత భయం కాంగ్రెస్‌లో కన్పిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని