logo

హాస్య నట సార్వభౌమ ద్వారకీశ్‌ కన్నుమూత

సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత ద్వారకీశ్‌ (81) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఉదయం నిద్ర లేచిన ఆయన కాఫీ తాగి, మళ్లీ నిద్రపోయారు. అదే ఆయనకు చిరనిద్రగా మారింది.

Published : 17 Apr 2024 05:11 IST

 పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రముఖులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత ద్వారకీశ్‌ (81) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఉదయం నిద్ర లేచిన ఆయన కాఫీ తాగి, మళ్లీ నిద్రపోయారు. అదే ఆయనకు చిరనిద్రగా మారింది. మైసూరు జిల్లా హుణసూరులో శ్యామరావు, జయమ్మ దంపతులకు 1942 ఆగస్టు 19న జన్మించిన బుంగ్లె శివశంకర్‌ సినిమాల్లోకి వచ్చిన అనంతరం ద్వారకీశ్‌గా మారారు. తన మేనమామ, దర్శకుడు హుణసూరు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో చిత్ర రంగంలోకి వచ్చారు. దిగ్గజ నటులు డాక్టర్‌ రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, అంబరీశ్‌ తదితరులతో కలసి పలు చిత్రాల్లో నటించారు. ఆయన 4.1 అడుగుల ఎత్తు మాత్రమే ఉండడంతో ‘కన్నడద కుళ్ల’ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునేవారు. నటనకు కావలసింది ప్రతిభ మాత్రమే అని ఆయన నిరూపించారు. ఆయన 85కు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో 10 చిత్రాల్లో కథానాయకునిగా కనిపించారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేసి, తన సోదరునితో కలిసి భారత్‌ ఆటోస్పేర్స్‌ పేరిట ఆటోమొబైల్‌ విడిభాగాలను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించారు. చివరికి 1963లో చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. మొదటిసారి 1985లో దర్శకత్వం వహించగా, ‘నీ బరద కాదంబరి’ సూపర్‌ హిట్‌ కావడంతో చక్కని గుర్తింపు వచ్చింది. కిట్టు-పుట్ట, సింగాపురదల్లి రాజ కుళ్ల, భాగ్యవంతరు, గురు-శిష్యరు, పెద్ద గద్దె, ఆప్తమిత్ర తదితర చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి. ‘చౌక’ ఆయన నటించిన చివరి చిత్రం. తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ‘మమతెయ బంధన’ అనే చిత్రానికి సహ నిర్మాతగా, 1969లో డాక్టర్‌ రాజ్‌కుమార్‌, భారతి ప్రధాన పాత్రలు పోషించిన ‘మేయర్‌ ముత్తణ్ణ’కు పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరించారు. డ్యాన్స్‌ రాజా డ్యాన్స్‌, నీ బరదె కాదంబరి, నీతందె కాణికె, శ్రుతి, శ్రుతిహాకిద హెజ్జె, రాయరు బందరు మావన మనెగె, రసిక, కిలాడిగళు.. తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆఫ్రికాలో చిత్రీకరించిన ‘షీలా’ సినిమా ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. లీలావతి కుమారుడు వినోద్‌ రాజ్‌ను 1987లో చిత్రపరిశ్రమకు ‘డ్యాన్స్‌ రాజా డ్యాన్స్‌’ ద్వారా పరిచయం చేశారు.

  • ద్వారకీశ్‌ ఐదేళ్ల కిందటే (2019) మరణించారన్న వార్తలు వచ్చాయి. అవన్నీ వదంతులేనని టీవీ ఛానెళ్ల ముందుకు వచ్చి ఆయన చెప్పుకొన్నారు. గత ఏడాది కూడా ఇదే తరహా వదంతులు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లోని తన ఇంటిని నటదర్శకుడు రిషబ్‌ శెట్టికి విక్రయించేయడం గమనార్హం. శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడిగా ‘ఆయుష్మాన్‌ భవ’ చిత్రాన్ని నిర్మించారు. ఆశించిన స్థాయిలో అది విజయం సాధించకపోవడంతో నష్టాలను ఎదుర్కొన్నారు. మూడేళ్ల కిందట ఆయన రెండో భార్య శైలజ ఏప్రిల్‌ 16నే మరణించారు. మొదటి భార్య అంబుజ. వారిద్దరికీ 1967లో వివాహమైంది. అనంతరం శైలజను ప్రేమించారు. అంబుజ దగ్గరుండి భర్తకు రెండో వివాహం చేయించింది. వివాహం అనంతరం ముగ్గురూ ఒకే ఇంట్లో ఉండేవారు. వీరికి సంతోశ్‌, యోగీశ్‌, గిరీశ్‌, సుకీశ్‌, అభిలాష్‌ అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరిలో ఇద్దరు చిత్ర పరిశ్రమలో ఉండగా, మిగిలిన వారు ఇతర వృత్తుల్లో కొనసాగుతున్నారు. చారులత, ఆయుష్మాన్‌ భవ, అమ్మ ఐ లవ్‌ యూ తదితర చిత్రాలను తన కుమారుడు యోగేశ్‌తో కలిసి ద్వారకీశ్‌ నిర్మించారు. మరో కుమారుడు గిరీశ్‌ చెన్నైలో ఉంటూ తమిళ ధారావాహికల్లో పని చేస్తున్నారు. ‘హృదయ కళ్లరు’ అనే సినిమాలో అభిలాశ్‌ నటించారు. ప్రస్తుతం ఆయన ఐటీ ఉద్యోగి. సంతోశ్‌ విదేశాల్లో స్థిరపడ్డారు. ద్వారకీశ్‌ అంతిమ దర్శనానికి రవీంద్ర కళాక్షేత్రలో ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా అంత్యక్రియలను నిర్వహిస్తామని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ద్వారకీశ్‌ మృతికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర పార్టీల నాయకులు, చిత్రపరిశ్రమ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు సంతాపాన్ని ప్రకటించారు.

చిత్రప్రదర్శనలు రద్దు

బెంగళూరు (మల్లేశ్వరం): నట, దర్శకుడు, నిర్మాత ద్వారకీశ్‌ మృతికి సంతాపంగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం అన్ని ఆటలనూ రద్దు చేస్తున్నామని చలనచిత్ర వాణిజ్య మండలి ప్రకటించింది. పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, దర్శకుల సంఘాలు తమ నిర్ణయానికి మద్దతు ఇచ్చాయని మండలి ప్రతినిధులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని