logo

భార్య హంతకుడికి ఐదేళ్ల కారాగారం

సారాయి తాగవద్దని అడ్డుకుంటున్న నసీమా (23) అనే గృహిణిని 2021 అక్టోబరు 19న బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ఆమె భర్త ఇబ్రహీం సయ్యద్‌ హబీబ్‌ (25)కు కలబురగిలోని ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం..

Published : 18 Apr 2024 08:27 IST

కలబురగి: సారాయి తాగవద్దని అడ్డుకుంటున్న నసీమా (23) అనే గృహిణిని 2021 అక్టోబరు 19న బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ఆమె భర్త ఇబ్రహీం సయ్యద్‌ హబీబ్‌ (25)కు కలబురగిలోని ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. నిందితుడు కలబురగి ఎంఎస్‌కే మిల్‌ బసవననగరకు చెందిన వాడు. కూలి పనులు చేసుకునేవాడు. సారాయి తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సారాయి తాగవద్దన్నందుకు పక్కనే ఉన్న బ్లేడు తీసుకుని ఆమె గొంతు కోశాడని పోలీసులు తెలిపారు.


ఆ దంపతుల తీరు.. మరీ ప్రమాదకరం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : బైకు ఫుట్‌రెస్టుపై కుమారుడ్ని (4) నిలబెట్టుకుని వెళుతున్న దంపతులను నెటిజన్లు తూర్పారబట్టారు. వీరు తమ కుమారుడ్ని నిలబెట్టి తీసుకువెళుతున్న తీరును మరో వాహనంపై వెంబడిస్తూ వచ్చిన యువకులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీడియో ఆధారంగా స్వయం ప్రేరితంగా కేసు నమోదు చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు వీరి వాహనం నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


ఇ-సిగరెట్ల స్వాధీనం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఇ-సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, విదేశీ సిగరెట్‌ ప్యాకెట్లు, హుక్కా ఫ్లేవర్లు, హుక్కా పాట్‌లను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను బెంగళూరులో అరెస్టు చేశామని నగర పోలీసులు తెలిపారు. వీటి విలువను రూ.32.35 లక్షలుగా గుర్తించామని నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ తెలిపారు. జప్తు చేసుకున్న వాటిలో 5.5 కిలోల గంజాయి ఉందన్నారు.


అశ్లీల పనుల ఆటకట్టు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : అంతర్జాలం నుంచి బాలల అశ్లీల వీడియోలు, ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకుని, వాటిని ఇతరులకు పంపిస్తున్న నూర్‌ ఇస్లాం చౌద్రి (37) అనే కాపలాదారును తూర్పు విభాగం సైబర్‌ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. అసోంకు చెందిన నిందితుడు హైన్స్‌ రోడ్డులోని ఒక భవంతిలో పని చేసేవాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అభివృద్ధి చేసిన ఒక సాంకేతికత సహకారంతో బాలల అశ్లీల చిత్రాలను డౌన్‌లోడ్‌ చేసి, వాటిని ఇతరులకు బదిలీ చేయడాన్ని తేలికగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా నిందితుడి వివరాలను గుర్తించి అరెస్టు చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ జప్తు చేసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.


ఓటు వేసి.. ప్రాణం వీడింది

ఉడుపి: ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్న పి.యశోదా నారాయణ ఉపాధ్య (83) అనే వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మావర తాలూకా సాస్తాన పండేశ్వర చడగర అగ్రహారకు చెందిన ఆమె అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం కోటేశ్వర ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు మరణించారు. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 75 శాతానికి పైగా ఓటు వేశారు. గురువారంతో ఆ అవకాశం ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని