logo

గెలుపు ఉత్తరం ఎవరికో!

ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది.

Published : 19 Apr 2024 03:08 IST

కాగేరి- నింబాళ్కర్‌ మధ్య తీవ్ర పోటీ

విశ్వేశ్వర హెగ్డే కాగేరి (భాజపా),     అంజలి నింబాళ్కర్‌ (కాంగ్రెస్‌)

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. మొన్నటి విధానసభ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులిద్దరూ ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీలో దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ అంజలి నింబాళ్కర్‌, భాజపా అభ్యర్థి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ముఖాముఖి తలపడుతున్నారు. కేంద్రంలో భాజపాకు నాలుగు వందల స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని, అధికారంలోకి వచ్చింది రాజ్యాంగాన్ని మార్చేందుకు అని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ఇక్కడి సిట్టింగ్‌ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డేకు ఆ పార్టీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించింది. విధానసభ మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేకాగేరిని బరిలో దించింది. అనంతకుమార్‌ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆపార్టీ అగ్రనేతలు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. విధిలేక ఆయనను పోటీ నుంచి తప్పించారు. కేసరి కంచుకోటగా పేరున్న ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది. విధానసభ ఎన్నికల్లో ఖానాపురలో ఓడిపోయిన డాక్టర్‌ అంజలి నింబాళ్కర్‌కు అవకాశం కల్పించింది. ఆమెకు కన్నడ సరిగా రాదని, మరాఠీ యాసలో ప్రసంగిస్తారని భాజపా నేతలు తప్పుపడుతున్నారు. వారి ప్రచారంలో ఈ అంశమే కీలకంగా మారడం ప్రస్తావనార్హం. ఆమె పదినిమిషాలైనా స్వచ్ఛమైన కోస్తా కన్నడ యాసలో మాట్లాడాలని కమలనాథులు సవాల్‌ చేశారు. ‘నేను కన్నడ మాధ్యమంలోనే చదువుకున్నా. మా ఊరు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. సహజంగానే ఖానాపుర ప్రాంతం వారంతా మరాఠీ యాసలో మాట్లాడతారు. నాకూ అదే సాధ్యమవుతోంది. నేను మాట్లాడేది కన్నడ కాదని పండితులు చెప్పాలి’ అని ఆమె ప్రతిసవాల్‌ విసిరారు. మరాఠీ భాషనూ గుర్తించాలని ఆమె చేసిన ప్రతిపాదనలు దూమారం సృష్టించాయి. ఆమె మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్‌)కి మద్దతుదారంటూ భాజపా కొత్త విమర్శ భుజానికెత్తుకుంది. కమలనాథులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థి విశ్వేశ్వర హెగ్డే కాగేరికి ఈసారి అసమ్మతి ఎక్కువగా ఎదురవుతోంది. ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే అనుచరులు ప్రచారానికి దూరమయ్యారు. టికెట్‌ ఇవ్వన్నందుకు ఆయన అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. ఈ భాజపా కుంచుకోట పరిధిలోని సెగ్మెంట్లలో ఐదు చోట్ల కాంగ్రెస్‌ శాసనసభ్యులు, మూడింట భాజపా సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అనంతకుమార్‌ హెగ్డే ఆరుసార్లు నెగ్గడం ఓ చరిత్ర. మాజీ గవర్నరు మార్గరేట్‌ ఆళ్వా 1999లో విజయం సాధించారు. ఒకప్పుడు కెనరా లోక్‌సభ నియోజకవర్గంగా దీనికి పేరుండేది. 2008లో ‘ఉత్తర కన్నడ’గా మార్చారు.

కార్వార సమీప మురుడేశ్వరలో మహేశ్వరుడి విశ్వరూప వేదిక

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు