logo

రాజకీయ రంగులరాట్నం

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి.

Published : 24 Apr 2024 06:00 IST

 ఎన్నికలవేళ నేతల ఆందోళనలు
తెరపైకి వినూత్న నిరసనలు

కరవు పరిహార నిధి విడుదలలో కేంద్రం చూపుతున్న  వివక్షను ఖండిస్తూ విధానసౌధ సమీప గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో ఆందోళన

ఈనాడు, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తమ గ్యారంటీ పథకాలతో ప్రచారాన్ని పరుగులుపెట్టిస్తుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన ఘనతలు, అభివృద్ధి కార్డు చూపుతూ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మొన్నటి వరకు రాష్ట్రానికి వచ్చిన ఈ రెండు పార్టీల జాతీయ నేతలు ఇవే అంశాలతో ప్రచారం చేశారు. నాలుగు రోజులుగా ఈ ప్రచారంలో ప్రస్తావిస్తున్న అంశాలు సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నాయి. జాతీయ స్థాయిలో రెండో విడత- రాష్ట్రంలో నిర్వహించే తొలివిడత ఎన్నికల్లో ఇవే కీలకపాత్ర పోషించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

అస్త్రాలెన్నెన్నో..

కేంద్ర, రాష్ట్రాల మధ్య కరవు పరిహారం కోసం జరుగుతున్న పోరు ఇప్పటిది కాదు. గతేడాది సెప్టెంబరు నుంచీ పరిహారం కోసం రాష్ట్ర సర్కారు కేంద్రానికి మనవి చేస్తూ వచ్చింది. రాష్ట్ర సర్కారు మూడుసార్లు, కేంద్ర బృందాలు రెండుసార్లు కరవుపై సమీక్ష చేపట్టి నివేదికను కేంద్రానికి సమర్పించాయి. కరవు కారణంగా రూ.35వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి అందులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం రూ.18,171.44 కోట్లను పరిహారంగా చెల్లించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలుదఫాలు విన్నవించారు. ఎంతకీ కేంద్రం స్పందించలేదన్న కారణంతో గత మార్చిలో సుప్రీంకోర్టులో రాష్ట్ర సర్కారు పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రమే ఈ నివేదికను సకాలంలో పంపని కారణంగా పరిహారం చెల్లించలేకపోయినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి కారణంగా నిధులు విడుదల చేయలేమని వీరు వెల్లడించారు. ఇంతలో రాష్ట్ర సర్కారు వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించిన కేంద్రం- నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది. సరిగ్గా ఇదే అంశాన్ని ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీలు ప్రచారంగా మలచుకుంటున్నాయి. ముందు రాష్ట్రానికి ఇవ్వాల్సిన పరిహారాన్ని చెల్లించి ఆపై ప్రధాని, అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించాలని కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం విధానసౌధ వద్ద ఆందోళనకు దిగారు. కరవు పరిహారం కోసం చేసిన పోరాటంలో మాకు విజయం దక్కినట్లు కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. ఇది కాంగ్రెస్‌ విజయం కాదు.. పరిహారాన్ని చెల్లించేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరింది మేము.. ఇందులో కాంగ్రెస్‌ విజయం ఎక్కడుందంటూ భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు.

ధార్వాడ విద్యార్థిని నేహా హత్యను నిరసిస్తూ బెంగళూరులో కేంద్ర మంత్రి, బెంగళూరు ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి శోభాకరంద్లాజె ఆధ్వర్యంలో నిరసన హోరు

చెంబు రాజకీయం..

ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ‘చెంబు రాజకీయం’ ప్రచారానికి అస్త్రంగా మారింది. ఆ రోజున కాంగ్రెస్‌ పత్రికలకు ఇచ్చిన ఓ ప్రకటనలో ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమిచ్చారు? చెంబు తప్ప.. అంటూ కాంగ్రెస్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ప్రకటనపై మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ స్పందిస్తూ యూపీఏ సర్కారు పదేళ్ల కాలంలో అవినీతికి పాల్పడి.. మోదీ అధికారంలో వచ్చేనాటికి ఆయనకు చెంబు చేతిలో పెట్టిందన్నారు. ఆ చెంబును మోదీ అక్షయపాత్రలా మార్చారని గౌడ కితాబిచ్చారు. నేడు ఇదే చెంబు రాజకీయం ప్రచారంలో హల్‌చల్‌ చేస్తోంది. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ భాజపాను చెంబు పార్టీగా అభివర్ణిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేసినట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. మూడు ప్రధాన పార్టీలు తమ సామాజిక మాధ్యమాలు, గోడ పత్రికల్లోనూ చెంబులు, కొబ్బరి చిప్పలను ముద్రించి పరస్పరం విమర్శించుకుంటున్నాయి.

విద్యార్థిని హత్యపైనా..

గత బుధవారం హుబ్బళ్లిలోని ఓ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినిని ఓ యువకుడు హత్య చేసిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ సంఘటన ప్రస్తుత ఎన్నికల్లోనూ రాజకీయ అస్త్రంగా మారింది. హత్య చేసింది అల్ప సంఖ్యాక వర్గాల యువకుడు కావటంతో.. కాంగ్రెస్‌ అధికారంలో ఇలాంటి ‘లవ్‌ జిహాద్‌’ హత్యలకు కొదవ లేదంటూ భాజపా ఆరోపించింది. రెండు రోజుల కిందట బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోదీ సైతం.. రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదని తప్పుపట్టారు. స్వేచ్ఛగా భజన చేసుకునే హక్కు హిందువులకు లేదని వ్యాఖ్యానించడంతో భాజపా ఈ ఉదంతాన్ని ప్రచారాస్త్రంగా మలచుకున్నట్లు స్పష్టమైంది. ఆ పార్టీ నేతలు ప్రతి ప్రచారంలోనూ ఈ హత్య సంఘటనతో పాటు ఇటీవల బెంగళూరులో ఓ కేఫ్‌లో బాంబు పేలుడు ఉదంతాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆదివారం హుబ్బళ్లికి వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె తండ్రి కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ కావటం గమనార్హం. వ్యక్తిగత అంశాన్ని రాజకీయం చేస్తున్న భాజపా రాష్ట్రంలో సామాజిక అలజడికి ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది.

కాంగ్రెస్‌ను గద్దెదించేస్తా:  దేవేగౌడ భీషణ ప్రతిజ్ఞ

రామనగర: కర్ణాటకలో అధికార పార్టీని గద్దె దించే వరకు విశ్రాంతి తీసుకోనని మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ శపథం చేశారు. బెంగళూరు గ్రామీణ లోక్‌సభ భాజపా అభ్యర్థి, తన అల్లుడు డాక్టర్‌ మంజునాథ్‌కు మద్దతుగా మంగళవారం ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ దళ్‌ మూడే చోట్ల పోటీ చేస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. మే 5న ఎన్నికల బహిరంగ ప్రచారం పూర్తయ్యేంత వరకు తాను రాయచూరు, బీదర్‌, కలబురగి తదితర ప్రాంతాల్లో భాజపా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. మోదీ మినహా మరెవరికీ ప్రధాని అయ్యే అర్హత దేశంలో లేదని పునరుద్ఘాటించారు. మోదీ, అమిత్‌షా ఒత్తిడి చేయడంతోనే డాక్టర్‌ మంజునాథ్‌ను ఇక్కడ ఎన్నికల్లో నిలబెట్టామని తెలిపారు.

‘సీబీఐ దర్యాప్తు అవసరం’

హుబ్బళ్లి: విద్యార్థిని నేహా హీరేమఠ్‌ హత్య కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని భాజపా అధ్యక్షుడు బీవై విజయేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నేహ తండ్రి నిరంజన్‌, ఇతర కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం కలసి మాట్లాడారు. హంతకుడిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. హత్య వెనుక మరికొందరు నిందితులున్నారని నిరంజన్‌ ఫిర్యాదు చేసినా.. పోలీసులు స్పందించలేదన్నారు. యాదగిరి, హుబ్బళ్లిలోనూ ఇదే తరహా ఘటనలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. పులకేశినగరలో అఖండ శ్రీనివాసమూర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నివాసానికి నిప్పు పెట్టిన ఘటనలో నిందితులకు శిక్ష విధించనే లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని