logo

అడ్డగోలు నిర్మాణాలు

పురపాలకంలో పట్టణ ప్రణాళిక విభాగం కీలమైంది. ఇది సక్రమంగా పని చేస్తేనే పట్టణాలు, నగరాలు సుందరంగా ఉంటాయి. ఆ విభాగంలో అవినీతి రాజ్యమేలుతుండటంతో రహదారులు, మున్సిపాలిటీ స్థలాలు, రెవెన్యూ, చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.

Published : 19 Jan 2022 06:03 IST

పాల్వంచ వెంకటేశ్వరకాలనీలో రాతిచెరువు శిఖంలో నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: పురపాలకంలో పట్టణ ప్రణాళిక విభాగం కీలమైంది. ఇది సక్రమంగా పని చేస్తేనే పట్టణాలు, నగరాలు సుందరంగా ఉంటాయి. ఆ విభాగంలో అవినీతి రాజ్యమేలుతుండటంతో రహదారులు, మున్సిపాలిటీ స్థలాలు, రెవెన్యూ, చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా చర్యలు తీసుకొన్న పాపానపోవడంలేదు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. పట్టించుకొన్న నాథుడే లేడు. భవనాలు వెలిసిన తర్వాత వాటి క్రమబద్ధీకరణలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలక సంఘాల్లో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. టాస్క్‌ఫోర్స్‌ పేరుతో ఏర్పాటు చేసిన బృందాలు తాజాగా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉపక్రమించారు. అయితే రాజకీయ నాయకులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.  


నిబంధనలకు విరుద్ధంగా..

భవన నిర్మాణ అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ప్లానులో భవన నిర్మాణం ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోలా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు ఆస్తిపన్ను, నల్లా పన్నులను వసూలు చేసే క్రమంలో అనుమానం వస్తే వెంటనే భవన నిర్మాణ అనుమతులను పరిశీలిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు తీసుకురావడంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారు. జీ+3కు అనుమతులు తీసుకుని అదనంగా పైఫ్లోరు, పెంట్‌హౌస్‌, సెల్లారు నిర్మించడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా పురపాలకానికి రావాల్సిన ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది.

సెట్‌బ్యాక్‌ లేకుండా..

పురపాలకాల్లో విస్తీర్ణానికి అనుగుణంగా అధికారులు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. నిబంధనలను పక్కనబెట్టి.. తక్కువ విస్తీర్ణంలో ఇష్టారాజ్యంగా ఇళ్లు కట్టేస్తున్నారు. సెట్‌బ్యాక్‌ లేకుండా కూడా భవనాలు నిర్మిస్తున్నారు. దీంతో ఇళ్ల మధ్య గాలి, వెలుతురు లేకుండా పోతుంది. మరోవైపు ఏకంగా ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలను విస్తరిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేయడమే తప్ప స్థానికంగా అందుతున్న ఫిర్యాదులను పట్టించుకున్న దాఖలాల్లేవు.


టీఎస్‌-బిపాస్‌ అనుమతులిలా..

1. 75 చ.గజాల వరకు విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో నివాస భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.

2. 75 చ.గజాల నుంచి 239.20 చ.గజాల లోపు గ్రౌండ్‌+1 వరకు(7 మీటర్ల ఎత్తు ఉండే) నివాస భవనాలకు వెంటనే అనుమతి ఇవ్వనున్నారు. స్థలానికి సంబంధించిన నిజధ్రువపత్రాలు, యజమాని వ్యక్తిగత చిరునామాకు సంబంధించిన పత్రాలు అవసరం.

3. 239.2 చ.గజాల నుంచి, 598 చ.గజాల వరకు ప్లాట్లలో స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు రానున్నాయి. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత స్వాధీనతా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.

4. 598 చ.గజాల కన్నా ఎక్కువ, గ్రౌండ్‌+2 అంతస్తుల కన్నా ఎక్కువ ఉండే ప్లాట్లలో, అన్ని నివాసేతర భవనాలకు ఏకగవాక్ష(సింగిల్‌ విండో) విధానం ద్వారా అనుమతులివ్వనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని