logo

ఏటా... ఊరట

మాతృ మరణాల నివారణకు ప్రభుత్వ కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే మరణాలు తగ్గాయి. ఏటా పదుల సంఖ్యలో మాతృ మరణాలు సంభవిస్తున్నాయి.

Published : 02 Dec 2022 02:55 IST

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

రామవరం ఎంసీహెచ్‌లో బాలింత మృతితో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు (పాత చిత్రం)

మాతృ మరణాల నివారణకు ప్రభుత్వ కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే మరణాలు తగ్గాయి. ఏటా పదుల సంఖ్యలో మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత 42 రోజుల్లోపు బాలింతలు మరణిస్తే వాటిని ప్రసూతి మరణాలుగా పరిగణిస్తారు. జాతీయ నమూనా సర్వే నివేదికలో రాష్ట్రం ప్రాతిపదికన ప్రతి లక్ష కాన్పుల చొప్పున వీటిని లెక్కిస్తారు.

మరణాల్లో..

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉభయ జిల్లాల్లో ఆరేళ్ల నుంచి మాతృమరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. 2017-18 నుంచి 2019-20 వరకు ఖమ్మం జిల్లాలో 37 మరణాలు సంభవించగా భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 64 నమోదయ్యాయి. 2021-22లో ఖమ్మం జిల్లాలో 17 మంది మరణించగా.. భద్రాద్రిలో మాత్రం 12 మంది చనిపోయారు. ఖమ్మం జిల్లాతో పోలిస్తే భద్రాద్రిలో ప్రసవాలూ తక్కువగానే జరిగాయి. ఈ ఏడాది రెండు జిల్లాల్లోనూ తొమ్మిది మంది చొప్పున బాలింతలు మరణించినట్లు నివేదిక చెబుతోంది. ఏటా జరుగుతున్న కాన్పులను పరిశీలిస్తే మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గర్భస్థ దశ నుంచి ప్రసవం వరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంరక్షణ పథకాలు అమలుచేస్తుంది. మాతృమరణాల తగ్గుదలకు ఇవి దోహదపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

గర్భిణుల సత్వర నమోదు నుంచి..

మాతృ మరణాల నివారణకు క్షేత్ర స్థాయి నుంచే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గర్భం దాల్చిన మూడో నెలలో స్థానిక ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పేర్లు నమోదు చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ నిరంతరం వారిని పర్యవేక్షిస్తున్నారు. మాతృమరణాల్లో ప్రధాన కారణంగా భావిస్తున్న రక్తహీనతను అధిగమించేందుకు ఐరన్‌ మాత్రలు అందిస్తున్నారు. హైరిస్క్‌ కేసులను ముందస్తుగానే గుర్తించి శ్రద్ధ చూపుతున్నారు. సాధారణ ప్రసవాలు పెంచేందుకు మిడ్‌వైఫరీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. గర్భస్థ దశలో యోగాసనాలు, వ్యాయామాలు, ఆహారం వంటి అంశాల ప్రాధాన్యం గురించి వివరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని