logo

అన్నపూర్ణగా మారిన తెలంగాణ వైపే దేశం చూపు: మంత్రి

రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యమిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 04 Jun 2023 04:58 IST

రఘునాథపాలెం రైతు వేదికలో కరపత్రాలను ఆవిష్కరిస్తున్న
మంత్రి అజయ్‌కుమార్‌, ఎంపీ నామా, కలెక్టర్‌ గౌతమ్‌ తదితరులు

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యమిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అన్నపూర్ణగా మారిన తెలంగాణ వైపే యావత్‌ దేశం చూస్తోందన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రఘునాథపాలెం, రాంక్యాతండా రైతు వేదికల్లో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌లతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధర, విద్యుత్తు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను పెంచామని, ప్రాజెక్టులను నిర్మించి సాగునీటిని అందించామన్నారు. రైతుబంధుతో ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం నుంచి పరిహారం జమవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ అండతో ఆర్థికంగా బలోపేతమై ఇప్పుడు ఆయననే గద్దె దించుతాం, ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని కొందరు ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీగా గ్రామాల్లో తట్ట మట్టి పోయని వాళ్లు ఇప్పుడు అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అటువంటి నాయకులను గ్రామ పొలిమేరల్లోనే అడ్డుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్లలో కనీవినీ ఎరుగని ప్రగతి సాధించామన్నారు. గతంలో వేసవి వస్తే గ్రామాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్తు అందక ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు. అన్నదాతల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ... రైతును రాజును చేసి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగలా మార్చిందన్నారు.  ప్రతి క్లస్టర్‌లో రైతు వేదికలు నిర్మించి పంటల సాగు, మార్కెటింగ్‌ మెలకువలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. డీఏఓ విజయనిర్మల, డీసీఓ విజయకుమారి, ఎంపీపీ భూక్యా గౌరి, జడ్పీటీసీ సభ్యురాలు మాలోతు ప్రియాంక, సర్పంచులు శారద, అమాలి, ఆత్మ ఛైర్మన్‌ లక్ష్మణ్‌ నాయక్‌, మద్దినేని వెంకటరమణ, మందడపు సుధాకర్‌, తాతా రఘురాం, నల్లమోతు శ్రీను, కుర్రా భాస్కరరావు, ఈరూనాయక్‌, కోటేశ్వరరావు, ఏడీఏలు శ్రీనివాస్‌, సరిత, తహసీల్దారు నరసింహారావు, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఓ భాస్కరరావు పాల్గొన్నారు.

నేడు సురక్షా దినోత్సవ్‌ ర్యాలీ

ఖమ్మం నేరవిభాగం: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించే ‘సురక్షా దినోత్సవ్‌’ ర్యాలీని  విజయవంతం చేయాలని సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ కోరారు. తన కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలోని  స్టేడియం నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమై పాత బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరుకుంటుందన్నారు. పోలీసు శాఖ ద్వారా ప్రజలకు ఒనగూరుతున్న సౌకర్యాల గురించి వివరిస్తామని తెలిపారు. జడ్పీ సెంటర్‌ నుంచి పోలీసు బ్యాండ్‌తో మయూరిసెంటర్‌ వరకు సాయంత్రంపాదయాత్ర చేపడతామన్నారు. అనంతరం పోలీసు  పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమానికి మంత్రి పువ్వాడ హాజరవుతారని పేర్కొన్నారు. అదనపు డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, శిక్షణ ఐపీఎస్‌ అవినాశ్‌కుమార్‌, ఏసీపీలు రామోజు రమేశ్‌, గణేశ్‌, ప్రసన్నకుమార్‌,       వెంకటస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని