logo

ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!

‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు.

Updated : 28 Mar 2024 04:56 IST

‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. పరీక్షల సమయంలో హైదరాబాద్‌, దిల్లీలో కొంతమందికి ఇవ్వాల్సి ఉంటుందని రూ.10వేల నుంచి రూ.15వేలు దండుకున్నారు. శిక్షణ కాలంలో ప్రతి దానికీ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. అడిగినంత ఇవ్వకపోతే డీలర్‌షిప్‌ లైసెన్స్‌ జారీలో ఇబ్బందులకు గురిచేస్తారు. రూ.10వేలతో పూర్తవుతుందనుకున్న శిక్షణకు రూ.లక్ష వెచ్చించాను’ అని భద్రాద్రి  జిల్లాకు చెందిన ఓ డీలర్‌ ఆవేదన వెలిబుచ్చారు.

వివిధ పంటల సాగులో ఎలాంటి ఎరువులు వాడాలి..? ఏ సమయంలో వేటిని ఉపయోగించాలి..? నకిలీ విత్తనాలను గుర్తించటం ఎలా..? తదితర అంశాలపై ఎరువుల డీలర్లకు అవగాహన కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘దేశీ శిక్షణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. సంబంధిత అధికారుల ధనదాహంతో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం  పక్కదారి పడుతోంది.

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం


 డీలర్ల బలహీనతలను ఆసరా చేసుకొని..

దేశీ శిక్షణ నిమిత్తం భద్రాద్రి జిల్లాలోని వ్యవసాయ శాఖకు చెందిన అధికారితో పాటు ఓ ఫెసిలిటేటర్‌.. డీలర్ల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శిక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10వేలు, సంబంధిత డీలర్‌ రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో ఏడాది కాలంలో 48 వారాలు తరగతి గది శిక్షణ, నాలుగు వారాలు క్షేత్రస్థాయి పరిశీలకు తీసుకెళ్లాలి. అనంతరం పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రం అందించాలి. శిక్షణ కాలంలో డీలర్ల బలహీనతలను   ఆసరాగా చేసుకుని అధికారి, ఓ ఫెసిలిటేటర్‌ రూ.లక్షల్లో    దండుకుంటున్నారనే పలువురు ఆందోళన చెందుతున్నారు.


ఎంపిక బాధ్యత సైతం  వారిదే..

ఎరువుల డీలర్లను బ్యాచ్‌గా విభజించి దేశీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించటం ఆనవాయితీ. ఏడాదిలో రెండు, మూడు బ్యాచ్‌లకు తర్ఫీదునిస్తారు. ప్రతి బ్యాచ్‌లో 40 మంది డీలర్లను సంబంధిత మండల వ్యవసాయ అధికారులు ఎంపిక చేయాలి. అయితే ఎంపిక బాధ్యతను సైతం వ్యవసాయశాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారి, ఓ ఫెసిలిటేటర్‌ నిర్వర్తిస్తున్నారని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ డీలర్లనే ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో 483 మంది ఎరువుల డీలర్లు ఉంటే సుమారు 280 మందికి శిక్షణ పూర్తైనట్లు సమాచారం.


పాఠాలు చెప్పేవారితోనే  కుమ్మక్కై..

శిక్షణ కాలంలో పాఠాలు చెప్పాల్సిన ఓ ఫెసిలిటేటర్‌తో వ్యవసాయశాఖకు చెందిన అధికారి కుమ్మక్కై ఈ దందాకు పాల్పడుతున్నారని డీలర్లు వాపోతున్నారు. డీలర్‌ చెల్లించే రూ.10వేలతోనే శిక్షణ, క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. నాసిరకమైన భోజనం పెడుతున్నారని, కొన్ని సందర్భాల్లో అసలు భోజనమే పెట్టడం లేదని డీలర్లు చెబుతున్నారు. హాజరుశాతం సరిగ్గా లేదని, పరీక్షల సమయంలో ఉన్నతాధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి డీలర్ల ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.


దేశీ శిక్షణలో డీలర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం నాదృష్టికి రాలేదు. విచారణ జరిపిస్తాం. అవినీతికి పాల్పడే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

బాబూరావు, డీఏఓ, భద్రాద్రి కొత్తగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని