logo

ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు

మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది.

Updated : 29 Mar 2024 04:49 IST

నిర్మానుష్యంగా మారిన సత్తుపల్లి రింగ్‌ సెంటర్‌

సత్తుపల్లి, కల్లూరు, న్యూస్‌టుడే: మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. సింగరేణి గనులున్న సత్తుపల్లిలో ప్రస్తుతం గరిష్టంగా 39,  కనిష్ఠంగా 24 డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. త్వరలోనే 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు దాటే పరిస్థితులు కన్పిస్తున్నాయి. దీంతో ఉదయం 10గంటల తర్వాత ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని కలవర పడుతున్నారు. కొందరు ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. మరి కొందరు  మట్టికుండలు, ఇతర ఉపశమన చర్యలు ఏర్పాటు చేసుకుంటున్నారు. భానుడి తీవ్రతకు పండ్ల రసాలు, శీతలపానీయాల వినియోగం పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం సమయాల్లో పట్టణాల్లో జనసంచారం లేక రోడ్లు, అంతర్గత వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వడదెబ్బకు గురయ్యారు.

వైద్యనిపుణుల సూచనలివే..

ఎండల గండం నుంచి గట్టెక్కేందుకు వైద్యనిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తమ శరీరాలను డీహైడ్రేషన్‌కు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. బయటకు వెళ్లాల్సివస్తే గొడుగు, తెల్లని టోపీ, వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. ఎప్పటికప్పుడు మంచి నీళ్లు, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య బాధితులు నీడ పట్టున ఉండటమే మేలు. వడదెబ్బ లక్షణాలైన జ్వరం రావడం, వాంతులు, విరేచనాలు, అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటివి కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దూర ప్రాంత ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదాలు వేసుకోవడమే మంచిది. ఉదయం 11గంటల్లోపు, సాయంత్రం 4గంటల తర్వాతే ప్రయాణాలు చేయాలి. వేపుళ్లు, బయట చిరుతిళ్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వడగాల్పుల సమయంలో ముక్కు, చెవుల్లోకి వేడిగాలి చొరబడకుండా తువాళ్లను చుట్టుకోవాలి.

శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి

శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌ కలిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. ఫ్లూయిడ్స్‌నూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఆసుపత్రిలోనూ అవసరమైన అన్ని మందులు, ఓఆర్‌ఎస్‌లు అందుబాటులో ఉన్నాయి.

డా.కిరణ్‌, సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం

వడదెబ్బకు లోనైతే జాగ్రత్తపడాలి

వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడకు చేర్చాలి. తడిగుడ్డతో ఒళ్లంతా తుడిచి మజ్జిగలో ఉప్పుకలిపి తాగించాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. వేసవిలో రోజుకు 15 గ్లాసుల నీళ్లు తాగాలి. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. మరిన్ని జాగ్రత్తలకోసం సమీప ఆశా, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి.  

డా.నవ్యకాంత్‌, కల్లూరు సీహెచ్‌సీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని