logo

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: సత్యవతి రాథోడ్‌

శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వంద రోజుల్లో కేవలం మహిళలకు ఉచిత ప్రయాణం మినహా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.

Published : 17 Apr 2024 02:57 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, పక్కన ఎంపీ మాలోతు కవిత, హరిప్రియ, దిండిగాల తదితరులు

ఇల్లెందు, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వంద రోజుల్లో కేవలం మహిళలకు ఉచిత ప్రయాణం మినహా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఇల్లెందు నియోజకవర్గ భారాస ప్రజాప్రతినిధులు, నాయకులతో మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులపై సీఎం, మంత్రులకు చిత్తశుద్ధి లేదని, పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. స్వార్థం కోసం పార్టీలు మారేవారి తీరు ఎక్కడా ఉన్నా మారదన్నారు. పలుమార్లు ఓటమి చెందిన బలరాంనాయక్‌ వంటి చెల్లని నోటు ఇప్పుడెలా చెల్లుతుందని ఎద్దేవా చేశారు. రాజకీయ కుట్రల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేయించిందని, త్వరలో ఆమె నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. ఎంపీగా వందసార్లు మాలోత్‌ కవిత ఇల్లెందుకు వచ్చి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. మరోసారి ఆమెను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్‌ తప్పిదంతోనే..: రైతు బీమా పథకం అమలుకాకపోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. ఎల్‌ఐసీ వారికి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా అమలుకావట్లేదని, కాంగ్రెస్‌ పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో భారాస గెలిచే మొదట స్థానం ఇదేనన్నారు. సమావేశంలో ఎన్నికల నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి  రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్‌  హరిప్రియ, జడ్పీ ఛైర్మన్‌ ఆంగోతు బిందు, పార్టీ జిల్లా మాజీ  అధ్యక్షుడు దిండిగాల రాజేందర్‌, నాయకులు   పి.వెంకటేశ్వరరావు, సిలివేరు సత్యనారాయణ,  శీలం రమేష్‌, ఆజాం, కృష్ణప్రసాద్‌, బాలు, పీవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు