logo

దర్గాలో దశరథ తనయుని కల్యాణం

భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణ సత్యనారాయణపురం సమీపంలోని హజరత్‌ నాగుల్‌మీరా మౌలాచాన్‌ దర్గా షరీఫ్‌లో అర్చకుల వేదమంత్రాల నడుమ బుధవారం శ్రీరామ నవమి వేడుక కనుల పండువగా సాగింది.

Published : 18 Apr 2024 05:50 IST

వేడుకలో అర్చకులు, మాలిక్‌ లక్ష్మీనారాయణ

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణ సత్యనారాయణపురం సమీపంలోని హజరత్‌ నాగుల్‌మీరా మౌలాచాన్‌ దర్గా షరీఫ్‌లో అర్చకుల వేదమంత్రాల నడుమ బుధవారం శ్రీరామ నవమి వేడుక కనుల పండువగా సాగింది. ఇందుకోసం దర్గాను రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. మాలిక్‌ లక్ష్మీనారాయణ, సత్యనారాయణపురానికి చెందిన పోకల దమ్మక్క వంశీయుల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణ వేడుకలో భారీగా భక్తులు పాల్గొన్నారు. దమ్మక్క వంశీయులు సంప్రదాయరీతిలో ప్రసాదాలను దర్గా కమిటీకి అందించారు.

ఇదీ నేపథ్యం: ఆరు దశాబ్దాలుగా కులమతాలకు అతీతంగా సాగుతున్న ఉర్సు ఉత్సవాలతో ప్రత్యేకత సంతరించుకున్న నాగుల్‌మీరా దర్గాలో 2008 నుంచి సీతారాముల లక్ష్మణ ఆంజనేయ పంచలోహ విగ్రహాలను పూజిస్తూ వస్తున్నారు. 2012లో తమిళనాడు రామేశ్వరం వెళ్లిన దర్గా కమిటీ సభ్యులు అక్కడ ఓ సాధువు ఇచ్చిన రామసేతు రాయిని దర్గాకు తీసుకొచ్చారు. నాటి నుంచి దాన్ని పూజిస్తూ ఏటా శ్రీరామ నవమి వేడుకలు జరుపుతున్నారు. 2021 నుంచి నవమి మరుసటి రోజు పట్టాభిషేక మహోత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని