logo

18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు

ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్‌-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం.

Published : 19 Apr 2024 02:57 IST

ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్‌-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. ఈ క్రతువులో పోలింగ్‌ యంత్రాంగం, వివిధ భాగస్వాములు, స్థానిక ప్రముఖుల సహకారంతో యువ ఓటర్ల చైతన్యం, తద్వారా పోలింగ్‌ పెంపునకు ఎన్నికల సంఘం కృషిచేస్తోంది. సిబ్బంది విధులను గౌరవిస్తూ, వారి పాత్రను తెలియజేస్తూ ‘యు ఆర్‌ ది ఒన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా ఓటుహక్కు పొందిన వారు, 18-30 ఓటర్ల సమూహమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు ప్రచార, భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- పాల్వంచ, న్యూస్‌టుడే

 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని పౌరుల్ని ఈ ప్రక్రియలో నిమగ్నం చేసేలా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు వేదికగా ‘టర్నింగ్‌ 18’ అనే ప్రత్యేక ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల వివరాలు, ఓటు చైతన్యంతో కూడిన సందేశాలను రూపొందించి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, లింక్డ్‌ ఇన్‌ ఇతర పబ్లిక్‌ యాప్‌లలో పోస్టు చేస్తున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలో ఎంత ప్రచారం సాగిస్తున్నా పట్టణ యువతరం పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా ఉదాసీనత ప్రదర్శిస్తోంది.

 ఉమ్మడి జిల్లాలో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్న వారిలో 30 ఏళ్ల లోపువారే అధికంగా ఉంటున్నారని  గత ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 18వ లోక్‌సభ ఎన్నికల్లో పద్దెనిమిదేళ్లు, ఆపై వయస్కులు ఓటేసి కీలకంగా మారాలని ప్రచారం చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ‘స్వీప్‌’ మాస్టర్‌ ట్రైనర్‌ సాయికృష్ణ పేర్కొన్నారు. యువత పోలింగ్‌పై ఉదాసీనత ప్రదర్శించడానికి గల కారణాలను గుర్తించి, సమస్యలకు పరిష్కారం చూపేలా జిల్లాస్థాయి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. లక్షిత సమూహం దృష్టిని ఆకట్టుకునేలా ఓటరు అంబాసిడర్ల సందేశ వీడియోలతో ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18 ఏళ్ల వరకు వయసున్న వారిలో స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న వారు 75.4 శాతం మంది ఉన్నారు. వీరిలో 88.9 శాతం  మంది సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది.
ముఖ్యంగా 18-30 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళా ఓటర్ల ఓటు భాగస్వామ్యాన్ని పెంచేలా ‘సమాచార సహిత చిత్రావళి’(ఇన్ఫోగ్రాఫిక్స్‌)తో ప్రచారం, ప్రదర్శనకు సిద్ధమవుతున్నట్లు భద్రాద్రి జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ విద్యాచందన పేర్కొన్నారు. దీనికి తోడుగా, మునుపటి ఎన్నికల ఆసక్తికర అంశాలను నేటి తరం ఓటర్లతో పంచుకునేలా ఎన్నికల కథల(చునావి కిస్సే)నూ అందుబాటులోకి తేవడం మరో విశేషం. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే యువత దృష్టిని ఎన్నికలపై మరల్చే ‘పదకేళీ’లను ఎన్నికల సంఘం స్థానిక భాషల్లో సృష్టించింది.

యంత్రాంగం బాధ్యతను గుర్తుచేస్తూ..

ఎంతటి బృహత్తర కార్యక్రమైనా అధికార యంత్రాంగం సమష్టి కృషి లేనిదే విజయం కావడం సాధ్యమని ఎన్నికల సంఘం భావిస్తోంది. ‘టర్నింగ్‌ 18’ వంటి కార్యక్రమం విజయవంతానికి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అందరు భాగస్వాముల అమూల్య పాత్రను గుర్తించడం, అభినందించడం, విధుల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘యు ఆర్‌ ది ఒన్‌’ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ‘ఏదేమైనా సరే, అదనపు బాధ్యత మాదే. కాబట్టి మీరు (ఓటర్లు) శ్రమించనక్కర్లేదు’ అనే ఇతివృత్తంతో పలు కథలు, దృశ్యాలతో వినూత్న ప్రచారం సాగిస్తున్నారు. శిక్షణలు, సమావేశాల్లో వీటిని ప్రదర్శిస్తున్నట్లు జిల్లాస్థాయి ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.
పాల్వంచ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ‘టర్నింగ్‌-18’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కళాశాలలో విద్యార్థులకు ఓటు ప్రాధాన్యాన్ని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో పక్కాగా ఓటేయాలని స్నేహితులు  అందరం నిర్ణయించుకున్నాం. ప్రలోభాలకు తలొగ్గకుండా, కుల,మతాలు చూడకుండా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి నచ్చిన అభ్యర్థికి ఓటేస్తా.  
- ఆకునూరి వివేకవర్ధన్‌, డిగ్రీ ద్వితీయ సంవత్సరం, పాల్వంచ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని